ఐరాస తీర్మానాన్ని ‘వీటో’తో అడ్డుకున్న రష్యా.. ఓటింగ్‌కు భారత్ గైర్హాజరు
ఉక్రెయిన్‌పై రష్యా దాడిని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండిస్తోంది. ఇది యుద్దోన్మాద చర్య అని ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో నినదిస్తున్నాయి. తాజాగా, భద్రతా మండలి ఉక్రెయిన్‌పై రష్యా దూకుడును అత్యంత బలమైన పదాలలో ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. తక్షణమే రష్యా తన బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. అమెరికా, అల్బేనియా ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై భద్రతా మండలిలోని 15 మంది సభ్యులలో 11 మంది అనుకూలంగా ఓటు వేశారు. చైనా, భారత్, యూఏఈలు మాత్రం ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ముందు నుంచి రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో భారత్ తటస్థ వైఖరే అవలంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఓటింగ్‌కు దూరంగా ఉంది. కాగా, శాశ్వత సభ్యునిగా రష్కాకు వీటో అధికారం ఉన్నందున ఈ తీర్మానం విఫలమైంది. అయినప్పటికీ పొరుగుదేశానికి వ్యతిరేకంగా పూర్తి స్థాయి దాడిని ప్రారంభించాలనే అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిర్ణయాన్ని ఖండించే చర్చకు ఒక ముఖ్యమైన అవకాశాన్ని అందించింది. రష్యా సైనిక చర్య ఆపి, చర్చలకు రావాలని, రానిపక్షంలో ఆంక్షలు విధించాలని, ఉక్రెయిన్‌కు ఆటంకం లేని మానవతా సాయం అందించాలని అందులో ప్రతిపాదించారు. ఈ తీర్మానంపై ఓటువేసిన అనంతరం ఐరాసలో అమెరికా రాయబారి లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ మాట్లాడుతూ.. ‘‘నన్ను ఒక విషయం స్పష్టంగా చెప్పనివ్వండి.. రష్యా, మీరు ఈ తీర్మానాన్ని వీటో చేయవచ్చు, కానీ మీరు మా గొంతుకలను వీటో చేయలేరు.. మీరు సత్యాన్ని వీటో చేయలేరు.. మీరు మా సూత్రాలను వీటో చేయలేరు.. మీరు ఉక్రెయిన్ ప్రజలను వీటో చేయలేరు’’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న రష్యా.. ఐరాస సాధారణ సభ ముందు ఇదే విధమైన తీర్మానంపై మరో ఓటును ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ తీర్మానానికి అత్యధిక సభ్య దేశాలు అనుకూలంగా ఓటువేస్తాయి. కానీ, తీర్మానం మాత్రం చెల్లుబాటు కాదు. ‘‘ఉక్రెయిన్‌పై దండయాత్రకు మద్దతిచ్చి తప్పు చేయవద్దు.. రష్యా ప్రస్తుతం ఒంటరే’’ అని ఐరాసలోని బ్రిటన్ రాయబారి బార్బరా ఉడ్‌వార్డ్ అన్నారు. తీర్మానం ఓటింగ్‌కు ముందు అమెరికా రాయబారి గ్రీన్ ఫీల్డ్ మాట్లాడుతూ.. ‘‘చాలా ధైర్యంగా, నిస్సిగ్గుగా మనకు తెలిసిన మన అంతర్జాతీయ వ్యవస్థను రష్యా బెదిరిస్తుంది... దానిని చూస్తూ మౌనంగా ఉండకుండా ఖండించాల్సిన బాధ్యత మాకు ఉంది... కనీసం అభ్యంతరం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది’’ అని వ్యాఖ్యానించారు.
By February 26, 2022 at 07:37AM
No comments