Breaking News

కొండ చీలికలో చిక్కిన యువకుడు.. రెండు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్


హాలీవుడ్‌ సినిమా ‘127 అవర్స్‌’ను తలపించే ఘటన కేరళలోని పాలక్కడ్‌ సమీప ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆ సినిమాలో పర్వతారోహకుడైన హీరో పెద్ద బండ కింద ఇరుక్కుని నిర్మానుష్యంగా ఉన్న లోయలో 127 గంటలు చిక్కుకుపోతాడు. ప్రస్తుతం మలప్పుజ సమీప కొండ చీలికలో గత రెండు రోజులుగా చిక్కుకున్న 23 ఏళ్ల యువకుడు బాబు పరిస్థితి కూడా అలాగే ఉంది. గత సోమవారం మిత్రులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన బాబు.. ప్రమాదవశాత్తూ జారిపడి చీలికలో చిక్కుకున్నాడు. అప్పటి నుంచి ఆహార పానీయాలు లేకుండా గత మూడు రోజుల నుంచి అందులోనే ఉన్నాడు. సహాయక బృందం ఎన్ని ప్రయత్నాలు చేసినా యువకుడి దాకా చేరలేకపోతోంది. కోస్ట్‌గార్డ్ హెలికాప్టర్‌ రంగంలోకి దిగి అతడ్ని కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. యువకుడ్ని రక్షించేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సైన్యం సాయం కోరారు. దీంతో బెంగళూరు నుంచి ఓ ప్రత్యేకదళం పంపుతున్నట్లు సదరన్‌ కమాండ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ అరుణ్‌ సీఎంవోకు సమాచారం ఇచ్చారు. తమిళనాడులోని వెల్లింగ్టన్‌ నుంచి మరో బృందం పాలక్కడ్‌కు బయలుదేరింది. సహాయకచర్యల్లో భాగంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నుంచి పారా కమాండోలు సైతం రానున్నట్లు సీఎం కార్యాలయం తెలిపింది. కొండ నడుమలో గూడు లాంటి చోట కూర్చొని సాయం కోసం ఎదురుచూస్తున్న బాబును కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ దళం కూడా ప్రయత్నిస్తోంది. గత సోమవారం మరో ఇద్దరు మిత్రులతో కలిసి కొండ శిఖరం ఎక్కేందుకు బాబు ప్రయత్నం చేశాడు. మిగతా ఇద్దరూ మధ్యలోనే విరమించుకున్నా.. అతడు మాత్రం విజయవంతంగా కొండ శిఖరం చేరుకున్నాడు. ఇదే సమయంలో ఉన్నట్టుండి కిందికి జారిపడి మధ్యలో ఇరుక్కున్నాడు. భూమి నుంచి 500 మీటర్ల ఎత్తులో చిక్కుకున్న యువకుడు.. తన మొబైల్ ఫోన్ ద్వారా ఫోటోలను షేర్ చేశాడు. రోజంతా కోస్ట్‌గార్డ్ హెలికాప్టర్ ప్రయత్నించినా ఆ చీలిక వద్దకు వెళ్లలేకపోయింది. పొద్దుపోవడంతో సహాయక చర్యలు నిలిచిపోయాయి. బుధవారం సాయంత్రం వరకూ యువకుడ్ని చేరుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. మంగళవారం మధ్యాహ్నం వరకూ యువకుడు సురక్షితంగానే ఉన్నాడని, అతడి ఆరోగ్యం సాధారణంగా ఉందని అధికారులు తెలిపారు. ఛార్జింగ్ అయిపోవడంతో మొబైల్ స్విచ్ఛాఫ్ అయ్యింది. పై నుంచి జారిపడటం వల్ల కాలికి గాయమైంది. ఘటన జరిగిన వెంటనే అతడి మిత్రులు స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.


By February 09, 2022 at 07:20AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kerala-youth-trapped-on-mountain-for-nearly-two-days-without-food-and-water/articleshow/89442385.cms

No comments