Breaking News

36 గంటలుగా చీకట్లో చండీగఢ్.. నిలిచిన నీటి సరఫరా.. ఇంతకీ ఏం జరిగింది?


విద్యుత్ శాఖ కార్మికులు మూడు రోజుల సమ్మెతో 36 గంటల నుంచి నగరం అంధకారంలో మగ్గుతోంది. నగరంలోని చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించిపోతోంది. సోమవారం సాయంత్రం నుంచి వేలాది ఇళ్లు చిమ్మ చీకట్లో మగ్గుతుంటే, నీటి సరఫరా నిలిచిపోయి జనం అల్లాడిపోతున్నారు. చాలా చోట్ల వీధి దీపాలు వెలగడం లేదు. మరోవైపు, ప్రభుత్వ ఆస్పత్రులు సర్జరీలను వాయిదా వేస్తున్నాయి. చండీగఢ్ ఆరోగ్య సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ సుమన్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘జనరేటర్ల సాయంతో సర్జరీలను నిర్వహించాలనుకున్నాం... కానీ ఆసుపత్రిలో 100 శాతం లోడ్‌ను జనరేటర్‌పై ఉంచలేం.. కాబట్టి, మేము ముందుగా నిర్ణయించిన శస్త్రచికిత్సలను రీషెడ్యూల్ చేయాల్సి వచ్చింది లేదా వాయిదా వేయాల్సి వచ్చింది’’ అని అన్నారు. పవర్ కట్‌తో ఆన్‌లైన్ తరగతులు, కోచింగ్ సెంటర్లుకు కూడా అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖ ప్రయివేటీకరణకు వ్యతిరేకిస్తూ సిబ్బంది, ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఉద్యోగ సంఘాల నేతలో కేంద్ర పాలిత ప్రాంతం సలహాదారు ధర్మపాల్ సమావేశమై సమ్మె విరమించాలని విజ్ఞ‌ప్తి చేసినా ఫలితం లేకపోయింది. ప్రయివేటీకరణ వల్ల తమ ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్నారు. సమ్మెకు వెళ్లిన ఉద్యోగులపై చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ కొరడా ఝుళిపించింది. మంగళవారం సాయంత్రం అత్యవసర సేవల నిర్వహణ చట్టాన్ని అమలు చేస్తున్నట్టు ప్రకటించి.. ఆరు నెలల పాటు విద్యుత్ శాఖలో సమ్మెలను నిషేధించింది. మరోవైపు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ఏర్పాట్లు చేసినట్టు చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు చెప్పినా.. నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు, వ్యాపారులు కరెంట్ కోతలపై ఫిర్యాదు చేశారు. పారిశ్రామిక ఉత్పత్తి, తయారీపై కూడా విద్యుత్ కోతలు ప్రభావం పడింది. ఈ అంశంపై పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు జోక్యం చేసుకుని, కేంద్రపాలిత ప్రాంత చీఫ్ ఇంజినీర్‌కు సమన్లు జారీచేసింది. విద్యుత్ సంక్షోభం నివారణకు తీసుకున్న చర్యల గురించి తమకు నివేదిక అందజేయాలని జస్టిస్ అజయ్ తివారీ, జస్టిస్ పంకజ్ జైన్ ధర్మాసనం ఆదేశించింది.


By February 23, 2022 at 10:41AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/water-supply-disrupted-and-hospitals-hit-due-to-electricity-workers-strike-in-chandigarh/articleshow/89764785.cms

No comments