Breaking News

మా ఊళ్లో ముస్లింలను బహిష్కరిస్తాం.. గ్రామస్థుల ప్రతిజ్ఞ: వీడియో వైరల్


ముస్లింలను తమ ఊరు నుంచి తరమేస్తామని గ్రామస్థులు ప్రతిజ్ఞ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సర్గుజా జిల్లాలోని లుండ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జనవరి 1న కుండికల, ఆరా గ్రామాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న అనంతరం ఈ వీడియో వెలుగుచూసింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వీడియో చిత్రీకరించిన వ్యక్తిని గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ వీడియో తీసిన వ్యక్తిని కనిపెట్టామని, ఈ వ్యవహారంతో ఏ రాజకీయ పార్టీ లేదా మత సంస్థ ప్రమేయం కనిపించలేదని పోలీసులు తెలిపారు.‘‘ఈ రోజు నుంచి హిందువులమైన మేం ఏ ముస్లిం దుకాణదారుని నుంచి వస్తువులను కొనుగోలు చేయం.. మా భూమిని ఏ ముస్లింకు అమ్మం లేదా అద్దెకు ఇవ్వం.. మేం హిందువులం, మా గ్రామాలకు వచ్చే సరుకులు అమ్మకానికి వచ్చే వారి మతాన్ని నిర్ధారించిన తర్వాత మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం.. మేము ముస్లింల వద్ద కూలీలుగా పని చేయబోమని ప్రతిజ్ఞ చేస్తున్నాం’’ అని వీడియోలో పేర్కొన్నారు. జనవరి 1 కొత్త సంవత్సరం సందర్భంగా పొరుగు జిల్లా బలరామ్‌లోని ఆరా గ్రామానికి చెందిన కొంతమంది అబ్బాయిలు విహారయాత్ర కోసం సుర్గజా జిల్లా కుండికాల వద్దకు వచ్చి స్థానికులతో గొడవ పడ్డారు. ఆ మర్నాడు స్థానిక ప్రజాప్రతినిధి ఇలియాస్ నేతృత్వంలో 10 మందికిపైగా వ్యక్తులు మోటార్ సైకిళ్లు, కార్లలో వచ్చి కుండికాలలోని బీరేంద్ర యాదవ్ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించారు. అతని కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బీరేంద్ర యాదవ్ మైనర్ మేనకోడలు సహా ఇంట్లో ఉన్నవారందరికీ గాయాలయ్యాయి. ఆరా గ్రామస్థుల దౌర్జ్యంపై బీరేంద్ర యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదుచేసి నిందితులను అరెస్ట్ చేశారు. కానీ, అదే రోజు స్థానిక కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కుండికాల గ్రామస్థులు ముస్లింలను గ్రామం నుంచి వెళ్లగొట్టాలని జనవరి 5న ప్రతిజ్ఞ చేశారు. ఈ వీడియో గురువారం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. సర్గుజా కలెక్టర్ సంజీవ్ ఝా మాట్లాడుతూ.. వీడియో బయటకు వచ్చిన తర్వాత ఏఎస్పీ, సబ్-డివిజినల్ మేజిస్ట్రేట్‌లు గురువారం ఆ గ్రామాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారని తెలిపారు. దర్యాప్తు తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు.


By January 08, 2022 at 09:13AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/hindu-villagers-taking-oath-to-boycott-muslims-in-chhattisgarh-video-viral/articleshow/88768632.cms

No comments