Breaking News

ప్రధాని పావు గంటే ఇబ్బంది పడ్డారు.. రైతులు ఏడాది పాటు ధర్నా చేయలేదా?: సిద్ధూ కౌంటర్


భద్రతా లోపంతో పంజాబ్‌లో ప్రధాని పర్యటన అర్ధాంతరంగా ముగియడంతో రాజకీయ దుమారం రేగుతోంది. ఈ అంశంపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. దేశ ప్రధానిని పంజాబ్ ప్రభుత్వం అవమానించిందని బీజేపీ చేసిన విమర్శలపై కాంగ్రెస్ ఘాటుగా బదులిచ్చింది. ఎలాంటి భద్రతా వైఫల్యం జరగలేదని పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ ఛన్నీ అన్నారు. ప్రధానిని కాపాడేందుకు తన ప్రాణాలైనా పణంగా పెడతానని, ఆయనకు ఎలాంటి ప్రమాదం తలెత్తలేదని వ్యాఖ్యానించారు. తాజాగా, ఈ అంశంపై పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు తీవ్రంగా స్పందించారు. బీజేపీ ఆరోపణలకు సిద్ధూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. భద్రత వైఫల్యంతో ప్రధాని 15 నిమిషాలు కారులోనే ఉండిపోయారని అంటున్నారు.. మరి సాగు చట్టాల రద్దు కోసం రైతులు ఏడాదికిపైగా వేచిచూసిన విషయం మీకు గుర్తులేదా? అని సిద్ధూ ప్రశ్నించారు. ‘‘నేను ప్రధాని మంత్రిని ఒక్కటే అడగాలనుకుంటున్నాను.. మన రైతు సోదరులు ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదికిపైగా ఉండిపోయారు.. వారు ఒకటిన్నర సంవత్సరాలు అక్కడే ఉన్నా మీ మీడియా ఎందుకు ఏమీ మాట్లాలేదో చెప్పండి.. నిన్న (బుధవారం) మీరు కేవలం 15 నిమిషాలు ఆగిపోయారు.. ఈ ద్వంద వైఖరి ఎందుకు ’’ అంటూ నవజోత్ సింగ్ సిద్ధూ నిలదీశారు. మరోవైపు, మోదీ భద్రత లోపం ముసుగులో పంజాబ్‌ ప్రతిష్ఠకు బీజేపీ భంగం కలిగిస్తోందని కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా ఆరోపించారు. ఢిల్లీ, నోయిడాల్లో ఎన్నోసార్లు ప్రధాని వాహనం ట్రాఫిక్‌లో చిక్కుకొని ఆగిపోయిందని, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను మోదీ నిందించలేదని పేర్కొన్నారు. వారణాసీలోనూ బాలికలు మోదీ కాన్వాయ్‌లోకి చొచ్చుకు వచ్చిన సమయంలో యూపీ సీఎంను మోదీ నిందించలేదని పవన్ గుర్తు చేశారు. భద్రత వైఫల్యం పేరుతో రాజకీయ డ్రామాకు బీజేపీ తెరతీసిందని కాంగ్రెస్ దుయ్యబట్టింది. అంతేకాదు, ఫిరోజ్‌పూర్‌లో 70వేల మందితో సభను నిర్వహించాలని బీజేపీ చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందని పేర్కొంది. పట్టుమని 700 మంది కూడా రాకపోవడంతో మీడియా దృష్టి మరల్చడానికి భద్రతా వైఫల్యం సాకుతో మోదీ వెనుదిరిగారని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది.


By January 07, 2022 at 09:25AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-modi-troubled-over-15-minutes-farmers-camped-for-a-year-slams-navjot-sidhu/articleshow/88747473.cms

No comments