దేశంలో సామాజిక వ్యాప్తి దశలోకి ఒమిక్రాన్.. ఇన్సాకాగ్ ప్రకటన
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజువారీ కేసులు మూడు లక్షలకుపైగా నమోదువుతుండగా.. మరణాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. కాగా, దేశంలో కొత్తరకం వేరియంట్ సామాజిక వ్యాప్తి దశలోకి చేరిందని ఇండియన్ సార్స్-కోవ్2 జినోమిక్స్ సీక్వెన్సింగ్ కన్సార్టియం () పేర్కొంది. ఒమిక్రాన్ కమ్యూనిటీ వ్యాప్తి కారణంగా ఆస్పత్రులు, ఐసీయూల్లో చేరేవారి బాధితుల సంఖ్య పెరుగుతోందని తెలిపింది. అయితే, చాలా కేసుల్లో స్వల్ప లక్షణాలు లేదా అసలు కోవిడ్ లక్షణాలు బయటపడటం లేదని వివరించింది. ‘‘కొత్త కేసులు భారీగా నమోదవుతున్న పలు మెట్రో నగరాల్లో ఒమిక్రాన్ వేరియంట్ ఆధిపత్యం కొనసాగుతోంది.. ముప్పుస్థాయిలో ఎటువంటి మార్పులేదు ’’ అని ఆదివారం విడుదల చేసిన వీక్లీ బులిటెన్‌లో ఇన్సాకాగ్ తెలిపారు. కాగా, దేశంలో కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ కేంద్ర ఆరోగ్య శాఖ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ అనే పదాన్ని మాత్రం ఉపయోగించడకపోవడం గమనార్హం. గతేడాది డెల్టా వేరియంట్ విజృంభించిన సెకెండ్ సమయంలోనూ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితి ఒకేలా లేదని, వివిధ ప్రాంతాల్లో ఒక్కోలా ఉందని చెప్పింది. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం.. ‘కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్’ అనేది భారీగా లోకల్ ట్రాన్స్‌మిషన్ వ్యాప్తి.. దీనిని పెద్ద సంఖ్యలో కేసులు లేదా పెరుగుతున్న పాజిటివిటీ, సెంటినెల్ (ల్యాబ్‌లో నిర్వహించే శ్వాసకోశ నమూనాల సాధారణ క్రమబద్ధమైన పరీక్ష) వంటి పరీక్షల ద్వారా అంచనా వేస్తారు. ‘‘భారత్‌లో ఒమిక్రాన్ ప్రస్తుతం సామాజికంగా వ్యాప్తి చెందే దశలో ఉంది.. పలు మెట్రో నగరాల్లో ఈ కేసులు అత్యధికంగా వెలుగులోకి వస్తున్నాయి.. ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ బీఏ.2 కేసులు కూడా వ్యాపిస్తున్నాయి’’ అని ఇన్‌సాకాగ్ ఆ బులెటిన్‌లో వెల్లడించింది. విదేశీ ప్రయాణికుల నుంచి కాకుండా అంతర్గతంగానే ఒమిక్రాన్ అధికంగా వ్యాప్తి చెందుతోందని ఇన్సాకాగ్ తన బులెటిన్‌లో పేర్కొంది. వైరస్‌లో జన్యుపరమైన మార్పులు అధికంగా చోటు చేసుకుంటూ ఉండడంతో నిరంతరం అందులో జరిగే మార్పుల్ని పర్యవేక్షిస్తున్నామని ఇన్సాకాగ్ స్పష్టం చేసింది. కరోనా వైరస్‌లో ఎన్ని రకాల జన్యు మార్పులు జరిగినప్పటికీ కోవిడ్ నిబంధనల్ని తు.చ తప్పకుండా పాటించడం, వ్యాక్సిన్ తీసుకోవడమే మనకి రక్షణ కవచాలని వివరించింది. కరోనా వ్యాప్తిలో నాలుగు దశలు ఉన్నాయని ఐసీఎంఆర్ చెబుతోంది. మొదటి దశలో ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని కరోనా పాజిటివ్‌గా గుర్తిస్తారు. రెండో దశలో ప్రాంతీయ స్థాయి వ్యాప్తి జరుగుతుంది. కానీ, విదేశాల నుంచి తిరిగి వచ్చి, పాజిటివ్ అయిన వారిని కలిసినవారిలోనే ఇది వ్యాపిస్తుంది. మూడో దశలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్(సామాజిక వ్యాప్తి). దీన్లో ఒకరికి వైరస్ వ్యాపించడానికి కారణం ఎవరో తెలుసుకోవడం కష్టం అయిపోతుంది. ఏ వైరస్‌కు అయినా నాలుగో దశ కూడా ఉంటుంది. ఆ సమయంలో అది ప్రాంతీయ స్థాయిలో మహమ్మారిగా మారిపోతుంది.
By January 24, 2022 at 08:45AM
No comments