Breaking News

యూపీలో బీజేపీకి వరుస ఎదురుదెబ్బలు.. మరో బాంబు పేల్చిన శరద్ పవార్


ఉత్తర్ ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే అస్త్రశస్త్రాలతో సన్నద్ధమయ్యాయి. ఇదే సమయంలో పార్టీ ఫిరాయింపులు వేగం పుంజుకున్నాయి. ఈ విషయంలో అధికార బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అధికార పార్టీ నుంచి సమాజ్‌వాదీ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. యూపీ కార్మిక శాఖ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎస్పీలో చేరి షాకిస్తే, ఆ తర్వాత మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఈ వరుస షాకుల నుంచి బీజేపీ తేరుకోక ముందే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ మరో బాంబు పేల్చారు. 13 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ, ఇతర చిన్నపార్టీలతో కలిసి ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు శరద్ పవార్ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఎన్నికల్లో తప్పకుండా మనం మార్పును చూస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా యూపీలో మతపరంగా ఏకీకృతం చేసే పనులు ప్రారంభమయ్యాయని, యూపీ ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని అన్నారు. అంతకు ముందు ముంబయిలో శరద్ పవార్ మాట్లాడుతూ.. గోవా ఎన్నికల్లో కాంగ్రెస్, టీఎంసీలతో కలిసి పోటీ చేసే దిశగా చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయని అన్నారు. ఎస్‌పీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ.. యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం దళితులు, రైతులు, సూక్ష్మ, మధ్యతరహా వ్యాపారాలను, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం మానేసిందని ఆరోపించారు. తన రాజీనామాకు అదే కారణమని స్పష్టం చేశారు. ప్రసాద్ మౌర్య రాజీనామా చేసిన కొద్ది సేపటికి మరో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీ నుంచి బయటకొచ్చారు. తిలహార్ ఎమ్మెల్యే రోషన్ లాల్ వర్మ, బిలహౌర్ ఎమ్మెల్యే భగవతి ప్రసాద్ సాగర్, తిండ్వారీ ఎమ్మెల్యే బ్రజేష్ ప్రజాపతిలు రాజీనామాలు చేశారు. వీరిలో రోషన్ లాల్ వర్మ ఎస్పీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. ఫిబ్రవరి 10న తొలి దశ పోలింగ్ జరగనుండగా.. మార్చి 7న చివరి, ఏడో దశ పోలింగ్‌ నిర్వహిస్తారు. మార్చి 10న ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు.


By January 12, 2022 at 09:40AM


Read More https://telugu.samayam.com/13-of-bjp-mlas-will-join-samajwadi-party-says-ncp-chief-sharad-pawar/articleshow/88846363.cms

No comments