Breaking News

ఫ్రాన్స్‌లో మరో కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ కంటే అధిక మ్యుటేషన్లు


రెండేళ్లుగా కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. కొత్త వేరియంట్ల పుట్టుకతో టీకాలు అందుబాటులోకి వచ్చాయనే ఆనందం ఆవిరిపోయింది. దక్షిణాఫ్రికాలో గతేడాది నవంబరులో వెలుగుచూసిన కొత్తరకం వేరియంట్ ఒమిక్రాన్‌ విజృంభణతో ప్రపంచ దేశాలు మరోసారి వణికిపోతున్నాయి. రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతుండటంతో వేరియంట్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి చాలా దేశాలు మరోసారి కఠిన ఆంక్షతో కూడిన లాక్‌డౌన్‌లు విధిస్తున్నాయి. ఒమిక్రాన్‌ భయం వెంటాడుతుండగా.. తాజాగా మరో కొత్తరకం వేరియంట్‌ ఫ్రాన్స్‌లో గుర్తించారు. ఇది ఒమిక్రాన్‌ కంటే ఎక్కువ మ్యుటేషన్లు కలిగి ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. తీవ్రత ఎక్కువగా ఉన్న ఐరోపాలో ఈ కొత్త వేరియంట్‌ బయటపడింది. B.1.640.2 అనే కొత్త వేరియంట్‌ను గుర్తించినట్టు ఫ్రాన్స్‌ నిపుణులు వెల్లడించారు. దీనికి (B.1.640.2) అనే పేరును సూచించిన శాస్త్రవేత్తలు.. ఇందులో దాదాపు 46 మ్యుటేషన్లు జరిగినట్లు తెలిపారు. దీని స్పైక్ ప్రోటీన్‌లో N501Y,E484K మ్యుటేషన్లు ఉన్నాయని చెప్పారు. ఈ వేరియంట్‌కు సంబంధించి మార్సిల్లెస్‌ నగరంలో కనీసం 12 కేసులు బయటపడ్డాయి. వీరంతా ఆఫ్రికాలోని కామెరూన్‌ నుంచి వచ్చిన ప్రయాణికులేనని అక్కడి అధికారులు పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం వ్యాక్సిన్‌లపై ఈ కొత్త వేరియంట్‌ ఎటువంటి ప్రభావం చూపుతుందనే విషయాన్ని చెప్పడం తొందరపాటే అవుతుందని వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్‌లో వెలుగుచూసిన కొత్తరకం వేరియంట్‌లో 46 మ్యుటేషన్లు, 37 డిలీషన్లు జరిగినట్టు అమెరికాకు చెందిన ప్రముఖ ఎపిడమాలజిస్ట్‌, హెల్త్‌ ఎకనమిస్ట్‌ ఎరిక్‌ డింగ్‌ తెలిపారు. భవిష్యత్తులో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయని, ఇవన్నీ ప్రమాదకరమైనవి కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వేరియంట్‌ విస్తృతి, గతంలో వచ్చిన వ్యాధినిరోధకతను తప్పించుకునే సామర్థ్యం ఉంటేనే ఒమిక్రాన్‌ మాదిరిగా ఆందోళనకరంగా పరిగణిస్తారని చెప్పారు. ప్రస్తుతం ఈ కొత్త వేరియంట్‌ ఏ విభాగం కిందకు వస్తుందనే అంశాన్ని పరిశీలించి.. తద్వారా వైరస్‌ తీవ్రతపై ఓ అంచనాకు రావచ్చని ఎరిక్‌ డింగ్‌ వెల్లడించారు. ‘జన్యువుల మ్యుటేషన్.. ఫైలోజెనెటిక్ స్థానం ఆధారంగా కొత్త వేరియంట్‌కు IHU అని పేరును సూచించాం.. ఈ డేటా SARS-CoV-2 వేరియంట్‌ల అసాధారణ ఆవిర్భావం, పలు దేశాల భౌగోళిక ప్రాంతాలో పుట్టుకకు ఇది ఉదాహరణ’ అని పరిశోధకులు వ్యాఖ్యానించారు. పరిశోధన ఫలితాలను మెడ్‌రెక్సివ్ జర్నల్‌లో ప్రచురించారు. ‘స్పైక్ ప్రొటీన్‌లో N501Y, E484Kతో సహా పద్నాలుగు అమైనో యాసిడ్ ప్రత్యామ్నాయాలు.. 9 డిలీషన్లు.. B.1.640.2 పేరుతో కొత్త పాంగోలిన్ వంశాన్ని సృష్టించడానికి దారితీసింది.. గతంలో గుర్తించిన B.1.640 వేరియంట్ రూపాంతరం B.1.640.1 వంశానికి చెందినది’ అని తెలిపారు. మరోవైపు, ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. ముఖ్యంగా అమెరికా, యూరప్‌ దేశాల్లో వైరస్‌ ఉద్ధృతి అసాధారణంగా పెరుగుతోంది. సోమవారం అమెరికాలో ఒక్కరోజే 10లక్షల పాజిటివ్‌ కేసులు బయటపడడం వైరస్‌ తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పటికే ఒమిక్రాన్‌ వేరియంట్‌ 130 దేశాలకుపైగా విస్తరించింది. అయితే, ఫ్రాన్స్‌లో వెలుగు చూసిన ఈ కొత్తరకం వేరియంట్‌ కేసులు ఇతర దేశాల్లో నమోదైన దాఖలాలు లేవు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఒమిక్రాన్‌తో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న వేళ ఫ్రాన్స్‌లో బయటపడిన వేరియంట్‌ మరోసారి ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది.


By January 05, 2022 at 07:27AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/new-covid-19-variant-ihu-discovered-in-france-and-more-mutations-than-omicron/articleshow/88701192.cms

No comments