Breaking News

మంత్రి కుమారుడి దాష్టీకం.. తోటలో ఆడుకుంటున్న పిల్లలపై కాల్పులు


తన ఇంటి సమీపంలోని మామిడి తోటలో ఆడుకుంటున్న పిల్లలపై మంత్రి కుమారుడు కాల్పులకు పాల్పడిన ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. మంత్రి కుమారుడు జరిపిన కాల్పుల్లో నలుగురు చిన్నారులు గాయపడగా.. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రి కుమారుడు తన సిబ్బందితో కలిసి పిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తించడంతో బాధితుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. గ్రామస్థులతో కలిసి మంత్రి ఇంటిపై దాడిచేసిన వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పశ్చిమ చంపారన్ జిల్లా హర్దియా కొయిరి గ్రామంలో బీజేపీ నేత, పర్యాటకశాఖ మంత్రి నారాయణ ప్రసాద్‌కు ఓ ఇల్లు ఉంది. ఆ ఇంటి పక్కనే ఉన్న మామిడి తోటలో ఆదివారం కొందరు పిల్లలు చేరి క్రికెట్ ఆడుకుంటున్నారు. అయితే.. అక్కడ ఆడకూడదని, తక్షణమే వెళ్లిపోవాలని మంత్రి కుమారుడు బబ్లూ ప్రసాద్‌, అతడి ఇంటి సిబ్బంది పిల్లలను తొలుత హెచ్చరించారు. దీనిపై పిల్లలతో పాటు అక్కడున్న పెద్దలు అభ్యంతరం తెలపడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడి నుంచి వెళ్లిపోయిన బబ్లూ ప్రసాద్.. మంత్రి సోదరుడు సహా తన మందీ మార్బలాన్ని నాలుగు వాహనాల్లో తీసుకువచ్చి వారిపై దాడి చేశారు. ఆవేశంతో ఊగిపోయిన అతడు తన వద్ద ఉన్న తుపాకీ తీసి గాల్లోకి కాల్పులు జరిపాడు. అనుచరులు జరిపిన దాడిలో నలుగురు పిల్లలు గాయపడ్డారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న గ్రామస్థులు ఆగ్రహాం వ్యక్తం చేస్తూ మంత్రి ఇంటిపైకి వెళ్లి అక్కడ వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈలోగా మంత్రి కుమారుడు బబ్లూ అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మంత్రి ఇంటి నుంచి ఒక పిస్టల్‌, ఒక రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇంతవరకు మంత్రి కుమారుడిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితులు మండిపతున్నారు. అయితే, తన భూమిని గ్రామస్థులు ఆక్రమించుకునేందుకు యత్నించారని ఆరోపించారు. మొదట తన కుటుంబసభ్యులపై గ్రామస్థులే దాడి చేశారని ఫిర్యాదు చేశారు. తన కుమారుడు లైసెన్స్‌ కలిగిన తుపాకీతో అక్కడికి వెళ్లాడని, అతడిపైనా గ్రామస్థులు రాళ్లతో దాడి చేసినట్లు తెలిపారు. తన వాహనాన్ని కూడా ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు.పశ్చిమ చంపారన్ ఎస్పీ ఉపేంద్ర వర్మ మాట్లాడుతూ.. మంత్రి కుమారుడు ప్రసాద్ కుమార్ తన బాబాయి హరేంద్ర ప్రసాద్, మేనేజర్ విజయ్ షా ఇతర అనుచరులకు గాయాలయ్యాయని తెలిపారు. భూమిని ఆక్రమించుకోడానికి గ్రామస్థులు ప్రయత్నించడంతో అక్కడకు వెళ్లామని ఫిర్యాదు చేశారన్నారు.


By January 24, 2022 at 10:09AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bihar-tourism-ministers-son-beaten-up-after-allegedly-opening-fire/articleshow/89085785.cms

No comments