Breaking News

థర్డ్ వేవ్‌.. కోవిడ్ రోగుల్లో ఈ ఐదు లక్షణాలు సాధారణం: కేంద్ర అధ్యయనం


దేశ రాజధాని ఢిల్లీలో సెకెండ్ వేవ్‌తో పోల్చితే థర్డ్ వేవ్‌‌లో కోవిడ్ న్యుమోనియా తక్కువగా ఉన్నట్టు కేంద్ర అధ్యయనం పేర్కొంది. సోకినవారిలో జ్వరం, దగ్గు, గొంతు నొప్పి సాధారణంగా 5వ రోజు తర్వాత తగ్గుముఖం పట్టినట్టు పేర్కొంది. మూడో వేవ్ గురించి మరింత లోతుగా అవగాహన చేసుకోడానికి ఢిల్లీలో ఈ అధ్యయనాన్ని కేంద్రం నిర్వహించింది. దేశంలో ప్రత్యేకంగా ఢిల్లీలో మహమ్మారి సెకెండ్ వేవ్, మధ్య వ్యత్యాసాన్ని కేంద్ర అధ్యయనం వెల్లడించింది. థర్డ్ వేవ్‌లో అత్యంత సాధారణ ఐదు లక్షణాలను గుర్తించింది. ఈ అధ్యయనం ఢిల్లీలో చేపట్టినా దేశవ్యాప్తంగా ఇదే తరహాలో ఉంటుందని అంచనాకు వచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. జ్వరం లేదా చలిజ్వరం, దగ్గు, గొంతులో గరగర, కండరాల బలహీనత, అలసట ఈ ఐదు సాధారణ లక్షణాలు ఢిల్లీలోని 99 శాతం కోవిడ్ రోగుల్లో గుర్తించినట్టు నివేదికలో పేర్కొన్నారు. జ్వరం, దగ్గు గొంతులో గరగర ఐదు రోజుల తర్వాత తగ్గుముఖం పట్టినట్టు అధ్యయనంలో తేలిందన్నారు. అలాగే, 11 నుంచి 18 ఏళ్ల మధ్య చిన్నారుల్లో ఎగువ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌తో పాటు జ్వరం సాధారణ లక్షణమని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. థర్డ్ వేవ్‌లో కోవిడ్ న్యుమోనియా తక్కువగా ఉందని పేర్కొంది. గొంతులో దురద వేరియంట్ అత్యంత సాధారణ లక్షణంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. కరోనా టీకాలు భారత్‌కు భారీగా ప్రయోజనాన్ని చేకూర్చాయని కేంద్రం వెల్లడించింది. మూడో వేవ్‌ సమయంలో టీకా కారణంగా మరణాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని తెలిపింది. వ్యాధి తీవ్రత కూడా తక్కువగా ఉందని పేర్కొంది. అలాగే సెకండ్‌ వేవ్‌, తాజా ఉద్ధృతికి మధ్య పోలిక తెస్తూ ఆరోగ్య శాఖ టీకా ఆవశ్యతను వివరించింది. కరోనా సెకెండ్ వేవ్‌లో ఏప్రిల్ 30న 3,86,452 కొత్త కేసులు వచ్చాయి. 3,059 మరణాలు సంభవించాయి. 31 లక్షల క్రియాశీల కేసులున్నాయి. అప్పుడు 2 శాతం మంది రెండు డోసుల టీకా తీసుకున్నారు. ప్రస్తుతం జనవరి 20న 3,17,532 కొత్త కేసులొచ్చాయి. 380 మరణాలు నమోదయ్యాయి. వైరస్‌ బాధితుల సంఖ్య 19 లక్షలకు పైనే ఉంది. అర్హులైన జనాభాలో 72 శాతం మందికి రెండు డోసులు అందాయి. అప్పుడూ ఇప్పుడూ కొత్త కేసులు మూడు లక్షలపైనే ఉన్నప్పటికీ.. మరణాల పరంగా భారీ వ్యత్యాసం కనిపిస్తుండటం గమనార్హం.


By January 21, 2022 at 08:55AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/govt-lists-common-covid-symptoms-in-adults-and-children-during-3rd-wave/articleshow/89030555.cms

No comments