Breaking News

అవమానించిన రైతు ఇంటికే వచ్చి మహీంద్ర సిబ్బంది క్షమాపణ.. అదే రోజు వాహనం డెలివరీ


కర్ణాటకలో బొలెరో పికప్ వాహనాన్ని కొనుగోలుచేయడానికి మహీంద్రా కార్ల షోరూమ్‌కి వచ్చిన రైతును అక్కడ సిబ్బంది అవమానించిన ఘటనపై దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తాజాగా, రైతుకు జరిగిన అవమానకర ఘటన సుఖాంతమైంది. రైతు ఆర్డర్ చేసిన బొలెరో పికప్ ట్రక్కును సిబ్బంది స్వయంగా ఆయన ఇంటికే వచ్చి అప్పగించారు. అంతేకాదు, షోరూంలో జరిగిన ఘటనపై సిబ్బంది, అధికారులు ఆయనకు క్షమాపణలు చెప్పారు. దీనిపై కెంపెగౌడ సంతోషం వ్యక్తం చేశారు.‘మహీంద్ర షోరూం సిబ్బంది, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు శుక్రవారం ఉదయం మా ఇంటికి వచ్చారు.. వాళ్లంతట వాళ్లే వచ్చి క్షమాపణలు చెప్పి వాహనం కొనడానికి అహ్వానించారు.. అదే రోజు సాయంత్రం బొలెరో పికప్ ట్రక్కు డెలివరీ చేశారు... ఇలాంటి అవమానం ఎవరికీ జరగకూడదనే నేను కోరుకుంటున్నా.. వాహనాన్ని సమయానికి వచ్చినందుకు సంతోషంగా ఉంది’ అని కెంపెగౌడ పేర్కొన్నారు. అలాగే, వాహనం డెలివరీ చేసిన విషయాన్ని మహీంద్రా ఆటోమోటివ్ ట్విట్టర్ వెల్లడించింది. రైతు, ఆయన స్నేహితులకు జరిగిన అవమానానికి చింతిస్తున్నట్లు తెలిపింది. ‘జనవరి 21న మహీంద్రా షోరూంలో రైతు కెంపెగౌడ, ఆయన స్నేహితులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం.. ఇచ్చిన మాటకు కట్టుబడి తగిన చర్యలు తీసుకున్నాం. సమస్య ఇప్పుడు పరిష్కారమైంది.. మా వాహనాన్ని ఎంపిక చేసుకున్నందుకు కెంపెగౌడకు ధన్యవాదాలు.. మహీంద్రా కుటుంబంలోకి స్వాగతం’ అంటూ ట్వీట్ చేసింది. కాగా, ఈ ట్వీట్‌పై ఆ సంస్థ అధినేత ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. సంస్థ కుటుంబంలోకి కెంపెగౌడను ఆహ్వానిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. బొలెరో పికప్‌ వాహనాన్ని కొనేందుకు జనవరి 21న తుమకూరులోని మహీంద్రా షోరూంకి రైతు కెంపెగౌడ వెళ్లారు. అయితే అక్కడ సేల్స్‌మెన్ రైతును అవమానించి చులకన చేసి మాట్లాడాడు. ఈ కారు ధర రూ.10 లక్షలని, నీ దగ్గర కనీసం రూ.10 కూడా ఉండవంటూ హేళన చేశాడు. దీంతో రైతు అహం దెబ్బతిని.. దీన్ని అవమానంగా భావించి సేల్స్‌మెన్‌కు ఛాలెంజ్‌ చేసి.. అర గంటలో రూ.10 లక్షలతో మళ్లీ షోరూంకి వెళ్లాడు. ఓ అరగంటలో రైతు రూ.10 లక్షలు పట్టుకుని షోరూంలో అడుగుపెట్టడంతో అతడి వద్ద అంత డబ్బును చూసిన సేల్స్‌మెన్‌ కంగుతిన్నాడు. వెయిటింగ్‌ లిస్ట్‌ ఉందని, వాహనాన్ని వెంటనే డెలివరీ చేయలేమని, కనీసం నాలుగు రోజులు పట్టొచ్చని షోరూమ్ ఉద్యోగులు చెప్పారు. అయితే, తన పట్ల దురుసుగా ప్రవర్తించిన సేల్స్‌మెన్‌ క్షమాపణలు చెప్పాలని కెంపెగౌడతోపాటు అతని స్నేహితులు డిమాండ్‌ చేశారు. దీంతో మళ్లీ అక్కడ వాగ్వాదం చెలరేగింది. చివరకు విషయం పోలీసుల వరకు వెళ్లడంతో.. వారు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. విషయం తెలుసుకొని ఆ సేల్స్‌మెన్‌తో కెంపెగౌడకు క్షమాపణలు చెప్పించారు. కానీ, చివరిలో ట్విస్ట్ ఇచ్చిన ఆ రైతు.. మీ షోరూంలో వాహనాన్ని కొనబోనని తెగేసి చెప్తూ తెచ్చిన డబ్బుతో తిరిగి వెళ్లిపోయాడు. కాగా ఈ ఘటనలకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ట్విటర్ ఖాతాకు ఈ వీడియోలను కొందరు ట్యాగ్‌ కూడా చేశారు. ఈ వివాదంపై స్పందించిన ఆనంద్‌ మహీంద్రా తప్పుచేసినవారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.‘మా కంపెనీ ప్రధాన ఉద్దేశం.. అన్ని వర్గాల వారిని అభివృద్ధి చేయడమే. వ్యక్తుల మర్యాదను కాపాడటం మా ప్రధానమైన నైతిక విలువ. ఈ సిద్ధాంతాన్ని ఎవరు అతిక్రమించినా.. వారిపై తక్షణమే చర్యలు ఉంటాయి’ అని మహీంద్రా వెల్లడించారు.


By January 31, 2022 at 07:50AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/humiliated-karnataka-farmer-kempegowda-gets-an-apology-and-new-bolero-from-mahindra/articleshow/89233972.cms

No comments