Breaking News

వృద్ధుడి ఖాతాలో రూ.75 కోట్ల జమ.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన నిరుపేద రైతు!


ఓ నిరుపేద వృద్ధుడి బ్యాంకు ఖాతాలో రూ.75 కోట్ల డిపాజిట్ అయిన ఘటన ఝార్ఖండ్‌లోని చోటుచేసుకుంది. తన బ్యాంకు ఖాతాలో కోట్ల రూపాయలు ఉండటంతో ఆ వృద్ధుడికి గుండె ఆగినంత పనయ్యింది. దుమ్కా జిల్లా జార్ముండి మండలం సాగర్‌ గ్రామంలో పూలోరాయ్ అనే వ్యక్తి తన భార్య, నలుగురు పిల్లలతో ఓ పూరి గుడిసెలో నివసిస్తున్నాడు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబం జీవనం సాగిస్తోంది. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌లో అతనికి ఖాతా ఉంది. పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి సమీపంలోని రూరల్‌ సర్వీస్‌ సెంటర్‌కు సోమవారం వెళ్లాడు. తన ఖాతా నుంచి రూ.10,000 తీసుకున్నాడు. కానీ అకౌంట్‌లో ఇంకా రూ.75.28 కోట్లు ఉండటంతో పూలోరాయ్ అవాక్కయ్యాడు. అంత డబ్బులు తన ఖాతాలో ఉండటం చూసిన అతడికి కాళ్లూచేతులు ఆడలేదు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తనకు తెలియదని చెప్పాడు. మంగళవారం తిరిగి మరోసారి ఖాతాలోని నగదు ఎంత ఉందనేది పరిశీలించగా.. రూ.5 కోట్లు ఉన్నట్టు చూపించిందన్నాడు. మిగతా రూ.70 కోట్ల మళ్లీ వెనుక్కు ఎలా వెళ్లాయే తాను తెలియదని వివరించాడు. ఈ విషయం అందరికీ తెలియడంతో పూలోరాయ్‌ను కలవడానికి పెద్ద సంఖ్యలో జనం వస్తున్నారు. తన ఖాతాలోకి ఇంత పెద్ద మొత్తం డబ్బు రావడంతో ఏం జరుగుతుందోననే భయం పట్టుకుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. ఇన్నాళ్లూ ప్రశాంతంగా నిద్రపోయిన తనకు ఈ విషయం తెలిసినప్పటి నుంచి కంటిమీద కునుకే కరువయ్యిందని వాపోయాడు. ఇందులో నాతప్పు ఏంలేదని చేతులు జోడించుకుని అమాయకంగా సమాధానం చెబుతున్నాడు. ఖాతాలోకి కోట్లు వచ్చినా ఆయన మాత్రం పొలంలో పనులు చేయడం మాత్రం ఆపలేదు. కాగా, ఈ వ్యవహారంపై స్పందించిన బ్యాంకు అధికారులు.. ఫూలోరాయ్‌ ఖాతాలోకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో విచారణ చేస్తామని తెలిపారు.


By January 13, 2022 at 08:50AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/more-than-rs-75-crores-credited-poor-man-account-and-became-a-millionaire-overnight-in-jharkhand/articleshow/88867421.cms

No comments