Breaking News

శ్రీనగర్‌ లాల్ చౌక్‌లో ఎగిరిన జాతీయ జెండా.. 73 ఏళ్లలో తొలిసారి!


కశ్మీర్‌లోని శ్రీనగర్‌ ప్రఖ్యాత లాల్‌చౌక్ ఏరియాలోని క్లాక్ టవర్‌పై గణతంత్ర దినోత్సవం రోజున బుధవారం తొలిసారి జాతీయ జెండాను ఎగురువేశారు. 30 ఏళ్లలో ఇది రెండోసారి. గతంలో 1992 బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఇక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అయితే, స్థానికులే లాల్‌చౌక్‌ క్లాక్ టవర్‌పై త్రివర్ణ పతాకాన్ని ఎగురువేయడం ఇదే మొదటిసారి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత క్లాక్ టవర్‌పై జాతీయపతాకం ఎగురవేయడం ఇదే మొదటిసారి. లాల్‌చౌక్ ప్రాంతంలో ఎన్‌జీవోలు, ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి స్థానికులు 73వ వేడుకలు నిర్వహించారు. స్థానిక కశ్మీరీ యువకులు సాజిద్ యూసుఫ్ షా, సహిల్ బషీర్‌లు క్రేన్‌ సాయంతో క్లాక్ టవర్ పైవరకూ వెళ్లి అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ‘క్లాక్ టవర్‌పై చాలా సందర్భాల్లో పాక్ జెండాలు ఎగురుతుండటం నా చిన్నతనం నుంచి చూస్తున్నాను.. కానీ, స్వాతంత్రం వచ్చిన 73 ఏళ్ల తర్వాత భారత పతాకం ఎగురువేయడం నేను గర్వంగా భావిస్తున్నాను’ బషీర్ ఆనందం వ్యక్తం చేశారు. ‘స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇక్కడ పాకిస్థాన్ జెండాలు మత్రమే ఎగిరేవి.. శాంతికి విఘాతం కలిగిస్తూ వచ్చిన పాకిస్థాన్ ప్రేరేపిత వ్యక్తులు ఈ జెండాలు ఎగుర వేసేవారు.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇక్కడి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి.. నయా కశ్మీర్‌ అంటే ఏమిటని జనం అడుగుతున్నారు? ఇవాళ ఎగురవేసిన త్రివర్ణ పతాకమే నయా కశ్మీర్‌కు అర్ధం చెబుతుంది.. జమ్మూ కశ్మీర్ ప్రజలు కోరుకుంటున్నది కూడా ఇదే. మాకు పాక్ జెండాలు అక్కర్లేదు. మేము శాంతి, అభివృద్ధిని కోరుకుంటున్నాం’ అని జెండా వ్యాఖ్యానించాడు. జాతీయ గీతం ఆలపిస్తుండగా క్లాక్ టవర్‌పై జాతీయ జెండాను యువకులు ఎగురువేశారు. దేశభక్తి గీతాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు ఉద్వేగానికి లోనయ్యారు. కశ్మీర్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన యువకులు, బీజేపీ కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. కశ్మీర్ రాజకీయాలకు సంబంధించి క్లాక్ టవర్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. జమ్మూ కశ్మీర్‌ సహా దేశంలోని చాలా మంది నేతలు గతంలో క్లాక్‌ టవర్‌పై జెండా ఎగురవేసే ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాలేదు. దీనిపై స్థానిక యువకుడు సాజిత్ యూసుఫ్ మాట్లాడుతూ ‘‘స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశంలో ఎగరని ప్రాంతం ఇదొక్కటేనని.. గతంలో చాలా మంది ప్రయత్నించినప్పటికీ తామే తొలిసారిగా విజయవంతమయ్యాం.. భారతీయులుగా జాతీయ జెండాను ఎగురవేయడం తమకెంతో సంతోషాన్ని కలిగించింది’’ అని చెప్పాడు. కాగా, క్లాక్ టవర్‌పై ఎగురువేసిన జాతీయ పతాకాన్ని అధికారులు సూర్యాస్తమయానికి ముందే అవతపనం చేయడాన్ని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. ‘‘త్రివర్ణ పతాకం రెండు గంటలలోపే అదృశ్యమయ్యింది... అది రోజంతా అక్కడ ఉండలేదు.. ఫోటోల కోసం జాతీయ జెండాను ఎందుకు అవమానించారు? దేశభక్తి ,జాతీయవాదం ఇదేనా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, లాల్‌చౌక్‌ సహా గతంలో ఎప్పుడూ జెండాను ఆవిష్కరించని శ్రీనగర్‌లోని ప్రతాప్ పార్క్, ఇక్బాల్ పార్క్‌‌లోనూ త్రివర్ణ పతాకం రెపరెపలాడింది.


By January 27, 2022 at 08:57AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/national-flag-hoisting-at-srinagar-lal-chowk-clock-tower-in-first-time-in-73-years/articleshow/89146891.cms

No comments