50 ఎకరాలు అమ్మి రూ.8 కోట్ల ఖర్చు పెట్టినా దక్కని ప్రాణం.. కరోనాతో రైతు మృతి
కోవిడ్-19 చికిత్స కోసం ఆస్తులను అమ్ముకున్నా ప్రాణాలు దక్కని ఘటనలు దేశవ్యాప్తంగా వెలుగుచూస్తున్నాయి. కొవిడ్ చికిత్సలకు కార్పొరేట్ ఆస్పత్రులు లక్షలాది రూపాయల ఫీజు వసూలు చేస్తుండటంతో ఇళ్లో, పొలమో, స్థలమో అమ్ముకుని వీధినపడుతున్నారు. తాజాగా, ఓ రైతు కరోనాతో దాదాపు 8 నెలలు పోరాటం చేసి చివరకు మృత్యువుచేతిలో ఓడిపోయాడు. ఆయనకు చికిత్స కోసం ఆస్తులను అమ్మి ఏకంగా రూ.8 కోట్ల ఖర్చు చేశారు. అయినా కూడా ఆ రైతు ప్రాణం దక్కలేదు. కన్నీళ్లు పెట్టించే ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మౌగంజ్ తాలుకా రక్రి గ్రామానికి చెందిన ధరమ్‌జై సింగ్ అనే రైతు గతేడాది మే 2న కరోనా బారిపడగా.. చికిత్స కోసం రెవాలో ఉన్న సంజయ్ గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స కొనసాగుతుండగా ఆయన పరిస్థితి విషమించింది. దీంతో మెరుగైన వైద్యం కోసం మే 18న చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన ఊపిరితిత్తులు 100 శాతం దెబ్బతినడంతో సింగ్‌కు Extracorporeal membrane oxygenation (ECMO)పై ఉంచి చికిత్స కొనసాగించారు. దేశంలోనే ప్రముఖ వైద్యులు ఆయనకు చికిత్స చేయగా... లండన్ నుంచి ప్రత్యేకంగా డాక్టర్‌ను పిలిపించారు. అయినప్పటికీ.. 8 నెలల పాటు కరోనాతో పోరాడి చివరకు అపోలో ఆసుపత్రిలో సింగ్ కన్నుమూశారు. 8 నెలల పాటు కృత్రిమ ప్రాణాధార వ్యవస్థ మీదనే సింగ్ శ్వాస తీసుకున్నాడు. దేశంలో ఇంత సుదీర్ఘకాలం కరోనాకు చికిత్స తీసుకున్న తొలి వ్యక్తి సింగే కావడం గమనార్హం. సింగ్ కంటే ముందు మీరట్‌కు చెందిన విశ్వాస్ షైనీ 130 రోజుల పాటు కోవిడ్ చికిత్స తీసుకున్నారు. సింగ్ వైద్యం కోసం ఆయన కుటుంబం తమకున్న 50 ఎకరాల వ్యవసాయ భూమిని అమ్మి రూ.8 కోట్లు ఖర్చుపెట్టింది. రోజుకు రూ.3 లక్షల చొప్పున ఖర్చుచేసినా ప్రాణాలు దక్కలేదని కుటుంబ సభ్యులు వాపోయారు. కరోనా సమయంలో ప్రజలకు సేవలు చేస్తూ ఆయన కూడా మహమ్మారి బారినపడ్డారని కన్నీటిపర్యంతమయ్యారు. మధ్యప్రదేశ్‌లో స్ట్రాబెర్రీ, గులాబీల సాగులో సరికొత్త విధానాలను అవలంభించిన సింగ్.. దిగుబడిలో రికార్డు నెలకొల్పాడు. ఇందుకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా 2021 జనవరి 26న సత్కారం అందుకున్నారు. ఆయన కరోనా బారినపడ్డాడని తెలుసుకున్న మధ్యప్రదేశ్ సీఎం.. ప్రభుత్వం తరఫున తమ వంతుగా రూ.4 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది.
By January 14, 2022 at 08:58AM
No comments