Breaking News

గత 24 గంటల్లో 2.5 లక్షల కొత్త కేసులు.. మే 26 తర్వాత మళ్లీ ఆ స్థాయిలో


దేశంలో కరోనా కేసులు కొండలా పెరిగిపోతున్నాయి. కోవిడ్-19 మొదలైన తర్వాత ఎన్నడూ లేనంతగా గురువారం రోజువారీ కేసుల్లో పెరుగుదల నమోదుకావడం గమనార్హం. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకూ దేశవ్యాప్తంగా దాదాపు 2.5 లక్షల కొత్త కేసులు వెలుగుచూశాయి. ముందు రోజు కంటే ఇవి 50 వేలు అధికం. సెకెండ్ వేవ్‌లో గతేడాది మే 26 తర్వాత రోజువారీ కేసులు 2 లక్షలు దాటడం ఇదే మొదటిసారి. గురువారం ఉదయం వరకూ దేశవ్యాప్తంగా 2.47 లక్షల మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. మూడు వారాల కిందట లక్షలోపు ఉన్న యాక్టివ్ కేసులు.. ప్రస్తుతం 11 లక్షలకు చేరుకున్నాయి. కోలుకున్నవారి కంటే కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరోవైపు, మరణాలు కూడా పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ మరణాలు మరోసారి 400 దాటాయి. డిసెంబరు 28 నుంచి రోజువారీ కేసులు రెట్టింపు వేగంతో పెరుగుతుండటం దేశంలో కరోనా ఉద్ధృతికి అద్దం పడుతోంది. ఒక్క సోమవారం తప్పితే 15 రోజులుగా పాజిటివిటీ రేటు భారీగా పెరుగుతోంది. మంగళవారంతో పోల్చితే బుధవారం రోజువారీ కేసులు 26 శాతం అధికంగా నమోదయ్యాయి. రెండో దశ వ్యాప్తిలో మొదటిసారి ఏప్రిల్ 14న రోజువారీ కేసులు 2 లక్షలు నిర్ధారణ అయ్యాయి. ఆ రోజు 896 మరణాలు చోటుచేసుకున్నాయి. గతవారం వరకూ తక్కువ సంఖ్యలో ఉన్న మరణాలు నాలుగైదు రోజుల నుంచి పెరుగుదల ఆందోళనకు గురిచేస్తోంది. గతవారం కంటే ఈ వారంలో కరోనా మరణాల్లో 81 శాతం పెరుగుదల నమోదయ్యింది. దేశంలో మహారాష్ట్రలోనే అత్యధికంగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. బుధవారం అక్కడ కొత్తగా 46,723 మందికి వైరస్ నిర్ధారణ కాగా 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 28,041 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2,40,122కు చేరింది. ఒక్క ముంబయిలో కొత్తగా 16,420 కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మరణించారు. మరోవైపు మహారాష్ట్రలో బాధితుల సంఖ్య 1.367కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 27,561 కొత్త కేసులు 40 మరణాలు నమోదుకాగా.. 14,957 మంది కోలుకున్నారు. ప్రస్తుతం అక్కడ 87,445 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 26.22 శాతంగా ఉంది. కర్ణాటకలో 21,390 కొత్త కేసులు బయటపడగా.. పదిమంది చనిపోయారు. కేరళలో 12,742 కొత్త కేసులు, 199 మరణాలు చోటుచేసుకున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్‌లో 22,155 కొత్త కేసులు రిజిస్టర్ కాగా.. 23 మంది చనిపోయారు. గుజరాత్‌లో 9,941, యూపీలో 13,681, మధ్యప్రదేశ్‌లో 3,639, తెలంగాణలో 2,319 కేసులు నమోదయ్యాయి. కాగా, ప్రపంచంలో కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటిగా ఉంది. జనవరి 11న అమెరికాలో అత్యధికంగా 11 లక్షల కేసులు రికార్డయ్యాయి. అమెరికా, భారత్, బ్రిటన్, ఇటలీ ఈ నాలుగు దేశాల్లో రోజువారీ కేసులు లక్షల్లో బయటపడుతున్నాయి.


By January 13, 2022 at 07:39AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-covid-biggest-one-day-jump-to-2-5-lakh-fresh-cases-and-more-than-300-deaths/articleshow/88866468.cms

No comments