Breaking News

ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచినా.. 2024లో ఓడించడం సాధ్యమే: ప్రశాంత్ కిశోర్


కేంద్రంలో బీజేపీని 2024 ఎన్నికల్లో ఓడించడం సాధ్యమేనని, అందుకు తగిన ప్రతిపక్షం ఏర్పాటుకు తాను సహాయపడతానని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్షాలకు అనుకూలంగా రాకపోయినా ఇది సాధ్యమేనని ఆయన స్పష్టం చేశారు. సోమవారం ఎన్‌డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడున్న ప్రతిపక్షంతో మాత్రం బీజేపీని ఓడించలేమని చెప్పారు. హిందుత్వ నినాదం, జాతీయభావానికితోడు సంక్షేమ పథకాలతో ఎన్నికలకు వెళ్తోందన్నారు. ప్రతిపక్షాలు వీటిలో కనీసం రెండింటిని అధిగమించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాదు, కాంగ్రెస్‌ లేకుండా బలమైన ప్రతిపక్షం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. అయితే, ఇప్పుడున్న నాయకత్వంతో కుదరదని, ఆ పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేస్తేనే బీజేపీని ఓడించగలుగుతుందని ఉద్ఘాటించారు. వచ్చే నెలలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించకూడదని పీకే అన్నారు. ‘ఈ రౌండ్‌లో బీజేపీ అన్నింటినీ గెలిచి.. 2024లో ఓడిపోయే అవకాశం ఉంది.. 2012లో యూపీలో సమాజ్‌వాదీ పార్టీ, ఉత్తరాఖండ్‌లో , మణిపూర్‌లో కాంగ్రెస్, పంజాబ్‌లో అకాలీదళ్ గెలిచాయి.. కానీ 2014లో ఫలితాలు చాలా భిన్నంగా ఉన్నాయి’ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో కీలకమైన ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవాలంటే సామాజిక పునాదిని విస్తరించడం చాలా ముఖ్యం.. ఉమ్మడి ప్రతిపక్షాల సామాజిక పునాది బలంగా ఉండాలి. ఇప్పటి దానికంటే... అది యాదవేతర ఓబీసీ లేదా దళితుల లేదా అగ్రవర్ణాల మరింత ఏకీకరణ అయినా’ అని అన్నారు. అలాగే, 2024లో బీజేపీని ఢీకొనేందుకు బ్లూప్రింట్‌ను కూడా పీకే వివరించారు. ‘మీరు బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళను తీసుకుంటే అత్యంత ప్రజాదరణ ఉన్నా ఈ రాష్ట్రాల్లోని దాదాపు 200 స్థానాలలో కేవలం 50 సీట్లు మాత్రమే గెలుచుకోగలదు.. మిగితా 350 సీట్లలో బీజేపీ అన్నింటినీ కైవసం చేసుకుంటోంది.. ఇక్కడ చెప్పేది ఏమిటంటే కాంగ్రెస్ లేదా తృణమూల్, మరేదైనా పార్టీ లేదా కూటమి తమను తాము పునర్నిర్మించుకుని, వనరులను, వ్యూహాన్ని పునఃప్రారంభిస్తే 200 సీట్లలో 100 సీట్లను గెలుచుకోగలిగితే అప్పుడు ప్రతిపక్ష బలం 250-260కి చేరుకోగలదు’అని అన్నారు. కాబట్టి, ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో మరో 100 సీట్లు గెలవడం ద్వారా బీజేపీని ఓడించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అంతేకాదు, 2024లో బీజేపీతో బలంగా పోరాడే ప్రతిపక్ష ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడంలో సహాకరిస్తారనని తెలిపారు. ‘హిందుత్వ, జాతీయవాదం, ప్రజా సంక్షేమం వంటి అంశాలను ఉపయోగించుకుని బీజేపీ బలంగా ముందుకెళ్తోంది.. ప్రతిపక్ష పార్టీలు ఇందులో కనీసం రెండింటిని అధిగమించాలి.. కేవలం ఐక్యత కంటే ఎక్కువ చేయాలి.. బీహార్‌లో మహాకూటమిగా ఏర్పడినా 2015 నుంచి ఒక్క విజయం సాధించలేదు. కేవలం పార్టీలు, నాయకుల కలిస్తే సరిపోదు’ అని అన్నారు. మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లోని 200 చోట్ల బీజేపీకి కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్ధని అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ ఇందులో 190 సీట్లు గెలుచుకుందన్నారు.


By January 25, 2022 at 08:43AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/poll-strategist-prashant-kishor-says-possible-to-defeat-bjp-in-2024-elections/articleshow/89105812.cms

No comments