Breaking News

సింహాలు, చిరుతపులులకు కోవిడ్-19 టీకా.. ట్రయల్స్‌కు కేంద్రం అనుమతి!


మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం రెండేళ్ల నుంచి భయం గుప్పిట్లో బతుకుతోంది. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌.. జంతువులను వదిలిపెట్టడం లేదు. తాజాగా, చెన్నైలోని ఓ జూలో రెండు సింహాలు కోవిడ్-19 బారిన పడి మృత్యువాతపడ్డాయి. ఈ నేపథ్యంలో జంతువులకు కూడా కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు హరియాణాలోని ఐసీఏఆర్‌-నేషనల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆన్‌ ఈక్విన్స్‌ (ఎన్‌ఆర్‌సీఈ) అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌తో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా ఉన్న ఆరు జూలలో ఈ క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టబోతున్నారు. అయితే, కేవలం సింహాలు, పులులు, చిరుత పులులకు మాత్రమే వ్యాక్సిన్‌ అందజేయనున్నారు. ఎంపిక చేసిన ఆరు జూలలో జునాగడ్‌లోని సక్కర్‌బాగ్ ఒకటి. ఇక్కడ 70కిపైగా సింహాలు, 50 చిరుతపులులు ఉన్నాయి. తొలి డోస్ ఇచ్చిన 28 రోజుల తర్వాత రెండో డోస్ ఇవ్వాలని నిర్ణయించారు. జంతువుల కోసం టీకాను అభివృద్ధి చేయాలని ఎన్‌ఆర్‌సీఈకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ఇటీవల ఆదేశాలిచ్చింది. ఒక జాతికి చెందిన జంతువులు 15కి మించి ఉన్న జూలలోనే క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహించాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే ట్రయల్స్‌ ప్రారంభించనున్నామని సక్కర్‌బాగ్ జూన్ డైరెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. గతేడాది జూన్‌లో చెన్నైలోని వండలూర్ జూ‌లోని 15 సింహాలు కరోనా బారినపడిన తర్వాత టీకాను అభివృద్ధి చేయాలని కేంద్రం ఆదేశించిందని పేర్కొన్నారు. కాగా, తొలిసారిగా 2020 ఏప్రిల్‌లో న్యూయార్క్‌లోని బ్రోనెక్స్‌ జూలో జంతువులకు కరోనా వైరస్‌ సోకినట్లు నిర్థరణ అయింది. భారత్‌లో గతేడాది హైదరాబాద్‌లోని జూలాజికల్‌ పార్క్‌లో ఎనిమిది సింహాలు కరోనా బారిన పడ్డాయి.


By January 22, 2022 at 07:21AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/centre-plans-covid-vaccine-clinical-trial-on-lions-and-leopards/articleshow/89051007.cms

No comments