Breaking News

రైతా.. మజాకా: కారు కొనేందుకు వెళితే అవమానం.. ఛాలెంజ్ చేసి అరగంటలో రూ.10 లక్షలు తెచ్చాడు!


రైతులంటే చాలా మంది ఒకరకమైన అభిప్రాయం ఉంటుంది. అమాయకులని, వారికి ఏమీ తెలియదని చిన్నచూపు చూస్తారు. సరిగ్గా అలాంటి అభిప్రాయమున్న ఓ కార్ల షోరూమ్ ఉద్యోగికి తగిన గుణపాఠం చెప్పాడు ఓ రైతు. వాహనం కొనుగోలు చేయడానికి వెళ్లిన రైతును షోరూమ్‌లోని సేల్స్‌మెన్ అవహేళనచేసి బయటకు వెళ్లిపోమన్నాడు. ఈ అవమానాన్ని జీర్ణించుకోలేని ఆ రైతు.. అతడికి సవాల్ విసిరి నోరుమూయించిన ఘటన కర్ణాటకలోని తుముకూరు పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. బొలెరో పికప్‌ ట్రక్‌ కొనేందుకు షోరూంకు వెళ్లిన రైతును నీకు కారు కొనేంత స్థోమత లేదంటూ సేల్స్‌మెన్‌ అవమానించాడు. దీంతో ఆ రైతు ఛాలెంజ్‌ చేసి కొద్ది సమయంలోనే రూ.10 లక్షలతో మళ్లీ ఆ షోరూంలో అడుగుపెట్టాడు. ఆ రైతు వద్ద అంత డబ్బు చూసిన సేల్స్‌మెన్‌‌కు నోటి మాటరాక.. చివరికి క్షమాపణలు చెప్పాడు. కెంపెగౌడ అనే యువ రైతు బొలెరో పికప్‌ వాహనాన్ని కొనేందుకు శుక్రవారం తుమకూరులోని మహీంద్రా షోరూంకి వెళ్లాడు. అయితే ఆ రైతును అవమానించి, దురుసుగా ప్రవర్తించిన అక్కడ సేల్స్‌మెన్ వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పాడు. ‘ఆ కారు ధర రూ.10 లక్షలు.. నీ జేబులో వద్ద రూ.10 కూడా ఉండవు’ అంటూ హేళన చేయడంతో వారి మధ్య వాగ్వాదం మొదలైంది. దీన్ని అవమానంగా భావించిన కెంపెగౌడ.. ఓ గంటలో రూ.10 లక్షలతో వస్తానని, వెంటనే వాహనాన్ని డెలివరీ చేయగలరా అంటూ సేల్స్‌మెన్‌కు సవాల్ చేసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. చెప్పిన సమయానికి ముందే ఓ అరగంటలో రైతు రూ.10 లక్షలు పట్టుకుని షోరూంలో అడుగుపెట్టడంతో అతడి వద్ద అంత డబ్బును చూసిన సేల్స్‌మెన్‌ కంగుతిన్నాడు. వెయిటింగ్‌ లిస్ట్‌ ఉందని, వాహనాన్ని వెంటనే డెలివరీ చేయలేమని, కనీసం నాలుగు రోజులు పట్టొచ్చని షోరూమ్ ఉద్యోగులు చెప్పారు. అయితే, తన పట్ల దురుసుగా ప్రవర్తించిన సేల్స్‌మెన్‌ క్షమాపణలు చెప్పాలని కెంపెగౌడతోపాటు అతని స్నేహితులు డిమాండ్‌ చేశారు. దీంతో మళ్లీ అక్కడ వాగ్వాదం చెలరేగింది. చివరకు విషయం పోలీసుల వరకు వెళ్లడంతో.. వారు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. విషయం తెలుసుకొని ఆ సేల్స్‌మెన్‌తో కెంపెగౌడకు క్షమాపణలు చెప్పించారు. కానీ, చివరిలో ట్విస్ట్ ఇచ్చిన ఆ రైతు.. మీ షోరూంలో వాహనాన్ని కొనబోనని తెగేసి చెప్తూ తెచ్చిన డబ్బుతో తిరిగి వెళ్లిపోయాడు. కాగా ఈ ఘటనలకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ట్విటర్ ఖాతాకు ఈ వీడియోలను కొందరు ట్యాగ్‌ కూడా చేశారు.


By January 25, 2022 at 07:22AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/karnataka-farmer-went-to-showroom-to-buy-car-humiliated-by-salesman-and-what-he-did/articleshow/89104441.cms

No comments