కొత్త బండికి ‘SEX’ సిరీస్‌తో నంబరు.. యువతికి షాకిచ్చిన రవాణా శాఖ!
కొత్తగా వాహనం కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఢిల్లీ యువతికి రవాణా శాఖ అధికారులు కేటాయించిన నెంబరు చిక్కులు తెచ్చిపెట్టింది. ఆమె వాహనానికి రిజిస్ట్రేషన్ నెంబర్ ‘SEX’ సిరీస్‌ను కేటాయించడంతో ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. దీనిపై తీవ్రంగా స్పందించి... రవాణా శాఖకు నోటీసులు జారీచేసింది. యువతి ఇటీవలే కొత్తగా స్కూటర్ కొనుగోలు చేసి, ఢిల్లీ రవాణ శాఖలో రిజిస్ట్రేషన్ చేయించింది. తన వాహనానికి కేటాయించిన ‘SEX’ సిరీస్ చూసి ఆకతాయిలు టీజింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. దీని వల్ల వాహనంతో బయటకు వెళ్లాలంటే భయమేస్తోందని, నిత్యావసర పనుల నిమిత్తం బయటకు వెళ్లలేకపోతున్నామని ఆమె తన ఫిర్యాదులో వాపోయింది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న మహిళా కమిషన్.. స్కూటర్ వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను వెంటనే మార్చాలని రవాణా శాఖకు నోటీసు జారీ చేసింది. అంతేకాదు, ఈ సిరీస్‌తో ఎన్ని వాహనాలకు రిజిస్ట్రేషన్ నెంబర్లు కేటాయించారనే వివరాలను సమర్పించాలని కోరింది. ఈ విషయంలో రవాణా విభాగానికి అందిన అన్ని ఫిర్యాదుల వివరాలను కూడా అందజేయాలని కమిషన్ సూచించింది. ఈ వ్యవహారంపై నాలుగు రోజుల్లోగా సమగ్ర చర్యలు తీసుకుని, నివేదికను ఇవ్వాలని పేర్కొంది. నోటీసులు జారీచేసిన ఢిల్లీ మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మాలివాల్ ‘SEX అనే పదాన్ని కలిగి ఉన్న ఈ సిరీస్‌లో రిజిస్ట్రేషన్ అయిన మొత్తం వాహనాల సంఖ్యను సమర్పించాలని నేను రవాణా శాఖను కోరాను.. ఆడపిల్ల ఇంతగా వేధింపులకు గురిచేసి, అసభ్యంగా ప్రవర్తించడం దురదృష్టకరం. ఇకపై ఆ యువతికి ఇబ్బంది కలగకూడదని ఈ సమస్యను పరిష్కారానికి రవాణా శాఖకు నాలు రోజుల సమయం ఇచ్చాను’ అని పేర్కొన్నారు. ఇదిలావుండగా ‘సెక్స్’ అనేది రిజిస్ట్రేషన్ కోసం ఆటోమేటిక్‌గా రూపొందించిన సిరీస్ అని రవాణా శాఖ అధికారి ఒకరు తెలిపారు. ‘మేము ఈ సిరీస్‌లో రిజిస్ట్రేషన్‌ను నిలిపివేశాం... సిస్టమ్ ద్వారా సిరీస్ ఆటోజనరేట్ చేస్తాం... దీనిపై ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే రిజిస్ట్రేషన్ నంబర్‌ను మార్చే అవకాశం ఉంది’ అని అధికారి తెలిపారు.
By December 05, 2021 at 09:26AM
No comments