Breaking News

కొద్ది క్షణాల్లో అంత్యక్రియలు.. నోట్లో గంగాజలం పోయగానే చితిపై నుంచి లేచిన వృద్ధుడు!


కొద్ది సేపట్లో అంత్యక్రియలు జరుగుతాయనగా.. చితిపై ఉంచిన వృద్ధుడు కళ్లు తెరిచి, మాట్లాడిన ఆశ్చర్యకర ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వైద్యులు చేసిన పొరపాటు వల్లే ఇలా జరిగినట్టు తెలుస్తోంది. ఆ వ్యక్తి చనిపోయినట్లు వైద్యులు తప్పుగా ధ్రువీకరించడంతో కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాల కోసం శ్మశానానికి తీసుకొచ్చారు. అయితే, చితికి నిప్పంటించడానికి ముందు నోట్లో గంగాజలం పోయగానే ఒక్కసారిగా అతడు కళ్లు తెరిచాడు. కదలిక వచ్చి మాట్లాడటంతో అందరూ విస్మయానికి గురయ్యారు. ఢిల్లీలోని టిక్రీ ఖుర్ద్ ప్రాంతానికి చెందిన సతీశ్‌ భరద్వాజ్‌(62) అనే కేన్సర్ బాధితుడు చికిత్స కోసం కొద్ది రోజుల కిందట ద్వారకలోని వేంకటేశ్వర ఆసుపత్రిలో చేరారు. సోమవారం తెల్లవారుజామున సతీశ్ భరద్వాజ్ చనిపోయినట్టు కుటుంబ సభ్యులకు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అతడి మరణాన్ని ఏకంగా 11 మంది వైద్యులు నిర్ధరించడం గమనార్హం. దీంతో కుటుంబసభ్యులు అంత్యక్రియల కోసం సోమవారం ఉదయం శ్మశానానికి తీసుకెళ్లారు. దహన సంస్కారానికి ముందు అతడి నోట్లో గంగాజలం పోశారు. అంతే.. వృద్ధుడిలో ఒక్కసారిగా కదలిక కనిపించి నెమ్మదిగా కళ్లు తెరిచాడు. అనంతరం మాట్లాడాటంతో అవాక్కైన కుటుంబసభ్యులు వెంటనే అంబులెన్సుకు ఫోన్ చేసి, పోలీసులకూ సమాచారం ఇచ్చారు. అనంతరం వృద్ధుడిని చికిత్స కోసం నరేలాలోని రాజా హరిశ్చంద్ర ఆసుపత్రికి తీసుకెళ్లారు. సతీశ్‌ భరద్వాజ్‌‌ను పరీక్షించిన వైద్యులు.. బీపీ, పల్స్, గుండె కొట్టుకోవడం సాధారణంగానే ఉన్నట్లు ధ్రువీకరించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తేలడంతో అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం లోక్‌నాయక్‌ జయ్‌ప్రకాశ్‌ నారాయణ్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.


By December 28, 2021 at 09:29AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/old-man-alive-minutes-before-the-funeral-in-tikri-khurd-of-delhi/articleshow/88535784.cms

No comments