Breaking News

మహారాష్ట్రలో ఒమిక్రాన్ తొలి కేసు.. దేశంలో నాలుగుకు చేరిన బాధితులు


దేశంలో ‘ఒమిక్రాన్‌’ వేరియంట్ శనివారం కొత్తగా ఇద్దరికి నిర్ధారణ అయ్యింది. ఒకటి గుజరాత్‌, మరొకటి మహారాష్ట్రలో నమోదయ్యింది. దీంతో దేశంలో కొత్త వేరియంట్‌ కేసులు నాలుగుకి చేరాయి. జింబాబ్వే నుంచి వచ్చిన గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందిన 72 ఏళ్ల వృద్ధుడికి ఉన్నట్టు తేలింది. నవంబరు 28న వచ్చిన అతడికి జ్వరం రావడంతో డిసెంబరు 2న నిర్వహించిన పరీక్షల్లో కొవిడ్‌ పాజిటివ్‌‌గా వచ్చింది. దీంతో అతడి నమూనాలను జన్యు విశ్లేషణకు పంపగా ఒమిక్రాన్‌ సోకినట్టు తేలింది. జింబాబ్వేలో ఉండే అతడు కొవిడ్‌ టీకారెండు డోసులు తీసుకుని, తన మామను చూసేందుకని సొంతూరు వచ్చాడని ఆరోగ్యశాఖ కమిషనర్‌ జై ప్రకాశ్‌ శివహరే తెలిపారు. బాధితుడిని ఖరాడిలోని గురుగోవింద్‌ సింగ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించినట్టు వెల్లడించారు. అతడిని కలిసినవారిలో అత్యధిక ముప్పున్న 8 మందికి, తక్కువ ముప్పున్న మరో 31 మందికి పరీక్షలు నిర్వహించారు.అందరికీ నెగెటివ్‌ ఫలితమే వచ్చింది. అయితే, మరికొన్ని రోజులు క్వారంటైన్‌లోనే ఉండాలని అధికారులు వారికి సూచించారు. ముంబయిలోని కళ్యాణ్‌ దొంబివ్లీకి చెందిన 33 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది. గతనెల 23న దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్‌, ఢిల్లీ మీదుగా ముంబయి చేరుకున్న అతడికి తాజాగా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఒమిక్రాన్‌ సోకినట్టు తేలిందని మహారాష్ట్ర ఆరోగ్య విభాగం డైరెక్టర్‌ డా.అర్చనా పాటిల్‌ వెల్లడించారు. నలుగురితో కలిసి అతడు భారత్‌ వచ్చాడని, వారి నమూనాలను కూడా జన్యు విశ్లేషణకు పంపుతున్నామని తెలిపారు. దేశంలో తొలిసారి కర్ణాటకలో ఇద్దరికి ఒమిక్రాన్ సోకిన సంగతి తెలిసిందే. వీరిలో ఒకరు దక్షిణాఫ్రికా దేశస్థుడు కాగా, మరొకరు స్థానిక డాక్టర్.


By December 05, 2021 at 09:50AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/two-more-cases-in-maharashtra-gujarat-take-indias-omicron-tally-to-4/articleshow/88100879.cms

No comments