రాబోయే మహమ్మారి కరోనా కంటే ప్రాణాంతకం కావచ్చు.. ఆక్స్‌ఫర్డ్ టీకా శాస్త్రవేత్త సంచలన వ్యాఖ్యలు
భవిష్యత్తులో మరో మహమ్మారి ఎదుర్కొడానికి సిద్ధంగా ఉండాలని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, రాబోయే వైరస్ కోవిడ్ కంటే మరింత ప్రమాదకరంగా ఉండొచ్చని ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తయారీలో కీలక పాత్ర పోషించిన సారా గిల్బర్ట్ వ్యాఖ్యానించారు. తదుపరి రాబోయే వైరస్ మరింత విస్తృతంగా వ్యాపించొచ్చని లేదా మానవాళికి మరింత ప్రాణాంతకంగా ఉండొచ్చని లేదా ఆ రెండు లక్షణాలూ కలిగి ఉండొచ్చని శాస్త్రవేత్త హెచ్చరించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ జెన్నెర్ ఇన్‌స్టిట్యూట్‌లో వ్యాక్సినాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సారా.. ఈ రంగంలో తన సేవలకుగానూ ఎలిజబెత్ రాణి- 2 నుంచి ‘డేమ్’ హోదాను అందుకున్నారు. బీబీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రిచర్డ్ డింబ్లేబై 44వ వార్షికోత్సవంలో శారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె.. మున్ముందు మహమ్మారి పరిస్థితులను ఎదుర్కొనేందుకు నిధులు పెంచాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. ఒమిక్రాన్ గురించి మాట్లాడుతూ దానిపై టీకాల ప్రభావం తక్కువగానే ఉండొచ్చని హెచ్చరించారు. ‘నిజం చెప్పాలంటే రాబోయే మహమ్మారి మరింత తీవ్రంగా ఉండొచ్చు.. విస్తృత వ్యాప్తి లేదా మరింత ప్రాణాంతకంగా లేదా ఆ రెండు లక్షణాలూ కలిగి ఉండొచ్చు’ అని పేర్కొన్నారు. ‘మనం అనుభవించిన ప్రతిదాన్ని మనం ఎదుర్కొన్న పరిస్థితిని మేము అనుమతించలేం.. ఆపై మనకు ఎదుర్కొన్న అపారమైన ఆర్థిక నష్టాలు మహమ్మారి పరిస్థితులను ఎదుర్కొడానికి ఇప్పటికీ నిధులు లేవని స్పష్టం చేస్తుంది’ అని సారా వ్యాఖ్యానించారు. సార్స్-కోవ్-2కు ప్రభుత్వం, ఫార్మ సంస్థలు వేగంగా స్పందించి టీకాలను అభివృద్ధి చేసి, అందుబాటులోకి తీసుకొచ్చాయి.. ఇతర వ్యాధులకు కూడా ఇదే నమూనాను అనుసరించాలన్నారు. ‘యుద్ధాలను ఎదుర్కొడానికి సాయుధ దళాలు, ఇంటెలిజెన్స్, దౌత్యంపై ఎలాగైతే ఖర్చుచేస్తామో.. మహమ్మారులను ఎదుర్కొడానికి కూడా ప్రజలు, పరిశోధనలు, ఉత్పత్తులు, సంస్థలపై ఖర్చు చేయాలి’ అని గిల్బర్ట్ సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర శాస్త్రవేత్తల మాదిరిగానే ప్రస్తుతం ఉన్న టీకాలు ఓమిక్రాన్ వేరియంట్‌పై తక్కువ ప్రభావవంతంగా పనిచేస్తాయని గిల్బర్ట్ అభిప్రాయపడ్డారు. కానీ, అంటువ్యాధులు సర్వసాధారణం కావచ్చు, ఆసుపత్రిలో చేరడం, మరణాలు పెరుగుతాయని దీని అర్థం కాదని స్పష్టం చేశారు.
By December 07, 2021 at 09:10AM
No comments