Breaking News

రాజకీయ పోరాటంలో రైతులు.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ..!


ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి.. విజయం సాధించిన రైతులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. సంయుక్త సమాజ్ మోర్చా బల్బీర్ సింగ్ రాజేవాల్ నాయ‌క‌త్వంలో ఎన్నికల్లో 117 స్థానాల్లో పోటీకి రైతులు సన్నద్ధం అవుతున్నారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించామని, ఇప్పుడు రాజకీయంగా కూడా పోరాడాలని భావిస్తున్నామని ఆ సంస్థ నాయకులు రాజేవాల్, హర్మీత్ సింగ్ ఖాదియన్, కుల్వంత్ షింగ్ సంధు అన్నారు. ఇది ప్రజల డిమాండ్‌ అని తెలిపారు. అయితే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని రైతు నాయకులు చెప్పారు. సంయుక్త సమాజ్ మోర్చాను రైతు వేదికగానే ఉంచాలని, రాజకీయ ఫ్రంట్‌కు ఆ పేరు వాడొద్దని నిర్ణయించారు. ఇందులో భాగంగా 2022 జనవరి 15న సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ స్థాయిలో సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో 22 రైతు సంఘాలు, ఆ సంఘాల నాయకులు పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను ప్రకటించినప్పటి నుంచి పంజాబ్ రైతులు పోరాటానికి దిగారు. ఈ పోరాటానికి పంజాబ్ రైతు సంఘం సంయుక్త సమాజ్ మోర్చా నాయకత్వం వహించింది. తొలుత 2020 నవంబర్ 25న ఢిల్లీ సరిహద్దుల దగ్గర నిరసనలకు దిగారు. అప్పటి నుంచి ఢిల్లీలోనే ఉంటూ రైతులు ఉద్యమించారు. కేంద్ర ప్రభుత్వం వారితో చర్చలు సాగించింది. కానీ అవేమి ఫలించలేదు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు పట్టుబట్టారు. దానికోసం నెలల తరబడి నిరసనలు తెలిపారు. వారి ఉద్యమానికి ఎంతోమంది నుంచి మద్దతు లభించింది. ఎట్టకేలకు నవంబర్ 19, 2021న ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.


By December 26, 2021 at 09:08AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/farmer-leaders-in-punjab-to-contest-assembly-polls/articleshow/88500133.cms

No comments