Breaking News

మహాపరినిర్వాన్ దివస్‌గా బాబాసాహెబ్ అంబేడ్కర్ వర్దంతి.. అసలు కారణం ఇదే


‘బాబాసాహెబ్’గా ప్రసిద్ధి పొందిన భారతరత్న డిసెంబరు 6, 1956లో కన్నుమూశారు. ఆయన వర్దంతిని ఏటా ‘మహాపరినిర్వాన్ దివస్’గా జరుపుకుంటున్నాం. దేశంలోని అణగారిన వర్గాల ఆర్ధిక, సామాజిక సాధికారికతకు అంబేడ్కర్ చివరి వరకూ పోరాటం చేశారు. రాజ్యాంగ పరిషత్తు సభ్యునిగా అంబేడ్కర్ విశేష శ్రమకోర్చి రాజ్యాంగ రచన చేయడం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం. ధర్మశాస్త్ర పండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నేత, స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, జాతీయోద్యంలో దళిత నాయకుడు, వృత్తి రీత్యా న్యాయవాది, భౌద్ధుడు, తత్వ శాస్త్రవేత్త, మానవశాస్త్ర అధ్యయనకర్త, చరిత్రకారుడు, ప్రసంగిడు, రచయిత, అర్థశాస్త్రవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త ఇలా అంబేడ్కర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బాల్యంలోనే అడుగడుగునా బాధలకు, అవమానాలకు గురయి.. పేదరికాన్ని ఎదుర్కొంటూ స్వయంకృషితో స్వీయప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్రమంత్రి పదవిని అలంకరించిన మహామనీషి శ్రీ బాబాసాహెబ్ అంబేడ్కర్. అంబేడ్కర్ తన జీవితకాలం అణగారివర్గాల గొంతుకను వినిపించి, వారి సాధికారికతకు పాటుపడ్డారు. కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి అర్ధశాస్త్రంలో గౌరవ డాక్టరేట్లు, అలాగే, ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థల్లో న్యాయ, ఆర్ధిక, రాజకీయ శాస్త్రాల్లో పరిశోధనలు చేశారు. విద్యాభ్యాసం తర్వాత ఆర్ధికవేత్తగా, ప్రొఫెసర్‌గా, న్యాయవాదిగా ఉన్నారు. తరువాత జాతీయోద్యమంలో భాగస్వామ్యమయ్యారు. స్వాతంత్రం తర్వాత దళితుల రాజకీయ హక్కులు, సామాజిక స్వేచ్ఛ కోసం పనిచేశారు. రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడిగా సేవలందించి ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం తయారీలో కీలక పాత్ర పోషించారు. అలాగే, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా స్థాపనలో అంబేడ్కర్ పాత్ర ఉంది. హిల్టన్ యంగ్ కమిటీకి బాబాసాహెడ్ అందించిన భావనతో కేంద్ర బ్యాంకు ఏర్పాటయ్యింది. జీవితాంతం అణగారి వర్గాల కోసం పోరాడి, వారికి ఆశాజ్యోతిగా నిలిచారు. తన జీవిత చరమాంకంలో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. గౌతమ బుద్దుని బోధనలకు ప్రభావితమైన అంబేడ్కర్.. బౌద్ధుడిగా మారడంతో ఆయన వర్దంతిని మహాపరినిర్వాణ దివస్‌గా జరుపుకుంటున్నాం. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ప్రధాన సంస్మరణలో భాగంగా మహాపరినిర్వాన్ దివస్‌ను జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘బాబా సాహెబ్ అమర్ రహే’ అనే ప్రసిద్ధ నినాదం స్ఫూర్తికి అనుగుణంగా అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించేందుకు సంసద్ భవన్, డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ బాబాసాహెబ్‌తో అనుబంధం ఉన్న పంచతీర్థ స్థలాలు, అంబవాడే వంటి ఇతర ప్రదేశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.


By December 06, 2021 at 10:08AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/why-we-celebrated-as-mahaparinirvana-divas-babasaheb-ambedkar-death-anniversary/articleshow/88115482.cms

No comments