Breaking News

మతమార్పిడి ఆరోపణలు.. స్కూల్‌పై మూక దాడి.. భయానక వీడియో


మత మార్పిడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఓ క్రిస్టియన్ మిషనరీ స్కూల్‌పై భజరంగ్ దళ్ కార్యకర్తలు దాడిచేసి, బీభత్సం సృష్టించారు. స్థానికులతో కలిసి పాఠశాలపై దాడిచేసి విధ్వంసానికి తెగబడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని విదీశ జిల్లా గంజ్ బసోడా పట్టణంలో చోటుచేసుకుంది. అక్కడ సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో ఎనిమిది మంది విద్యార్థులను క్రైస్తవంలో మార్చినట్టు సోషల్ మీడియాలో ఆరోపణలు రావడంతో దాడికి పాల్పడ్డారు. పాఠశాలకు వద్దకు వందలాదిగా చేరుకుని, యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్కూల్‌పై రాళ్లు రువ్వడంతో కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ఈ దాడి నుంచి విద్యార్థులు, సిబ్బంది త్రుటిలో తప్పించుకున్నారు. సీనియర్ ఇంటర్ విద్యార్థులు మ్యాథ్‌మెటిక్స్ పరీక్ష రాస్తున్న సమయంలోనే ఈ దాడి జరిగింది. దీంతో వారంతా భయంతో పరుగులు తీశారు. అల్లరి మూక దాడితో పరీక్షను సరిగ్గా రాయలేకపోయామని, మరోసారి నిర్వహించాలని విద్యార్థులు కోరారు. ఈ ఘటనపై సెయింట్ జోసెఫ్ స్కూల్ మేనేజర్ బ్రదర్ ఆంటోని మాట్లాడుతూ.. దాడి జరుగుతుందని స్థానిక మీడియా ద్వారా ముందు రోజే సమాచారం వచ్చిందన్నారు. దీంతో పోలీసులు, స్థానిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. అయితే, పోలీసులు మాత్రం సరైన భద్రత కల్పించలేదని ఆయన ఆరోపించారు. అంతేకాదు, మతమార్పిడుల ఆరోపణలను ఆయన ఖండించారు. ఫిర్యాదులో పేర్కొన్న పేర్లు ఏవీ విద్యార్థులతో సరిపోలడం లేదని తెలిపారు. మరోవైపు, మతమార్పిడుల ఆరోపణలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని స్థానిక భజరంగ్ దళ్ విభాగం నేత నీలేశ్ అగర్వాల్ డిమాండ్ చేశారు. ఒకవేళ ఇందులో పాఠశాల పాత్ర ఉన్నట్టు రుజువైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. మూక దాడితో పాఠశాల వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటుచేశారు. ఈ దాడికి కారకులైనవారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. అలాగే, మతమార్పిడి ఆరోపణల విషయంలో స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించనున్నట్టు సబ్-డివిజినల్ మేజిస్ట్రేట్ రోషన్ రాయ్ అన్నారు. ఇక, మతమార్పిడి ఆరోపణలపై విచారణ జరిపించాలని విదీశ కలెక్టర్‌కు జాతీయ బాలలహక్కుల రక్షణ కమిషన్ ఇంతకు ముందే లేఖ రాసింది.


By December 07, 2021 at 10:37AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/students-barely-escape-as-bajarang-dal-attack-school-in-madhya-pradesh/articleshow/88137289.cms

No comments