అక్రమాస్తుల కేసులో మాజీ మంత్రికి ఝలక్.. ఏపీ, తమిళనాడు సహా ఏసీబీ సోదాలు
మాజీ మంత్రి, సీనియర్ నేత తంగమణి నివాసంలో డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్, అధికారుల దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. బుధవారం ఉదయం తంగమణి ఇళ్లు, కార్యాలయాలు, ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితుల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. అక్రమ ఆస్తులను కూడబెట్టి.. ఆ సొమ్మును క్రిప్టో కరెన్సీలలో భారీ ఎత్తున పెట్టుబడులుగా పెట్టినట్టుగా సమాచారం అందుకున్న అధికారులు.. ఇప్పటికే ఆయనతో పాటు భార్య శాంతి, కుమారుడు ధరింధరన్‌లపై కేసు నమోదు చేశారు. అన్నాడీఎంకే ప్రభుత్వంలో విద్యుత్, ఎక్సైజ్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన తంగమణి వేలు.. భారీగా అక్రమాస్తులను కూడబెట్టిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (డీవీఏసీ)కి చెందిన 18 మంది అధికారుల బృందం.. బుధవారం ఉదయం 6.45 గంటలకు నమక్కళ్ జిల్లా కుమారపాళ్యం సమీపంలో గోవిందపాళ్యంలోని ఆయన నివాసానికి చేరుకుంది. మాజీ మంత్రికి చెందిన కార్యాలయాలు, సన్నిహితుల ఇళ్లు.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని మొత్తం 69 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. తమిళనాడులోని చెన్నై, వెల్లూరు, సేలం, కరూర్, నమక్కళ్, తిరుపూర్, కోయంబత్తూరు జిల్లాల్లోని 14 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. కర్ణాటకలో ఒకటి, ఆంధ్రప్రదేశ్‌లోని రెండు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమాస్తుల ఆరోపణలతో విజిలెన్స్ దాడులను ఎదుర్కొన్న ప్రతిపక్షానికి చెందిన ఐదో వేలు. గతంలో మాజీ మంత్రులు ఎంఆర్ విజయభాస్కర్, ఎస్పీ వేలుమణి, కేసీ వీరమణి, సీ విజయభాస్కరన్ ఇళ్లలోనూ అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.
By December 15, 2021 at 10:30AM
No comments