Breaking News

ఆ ఆరు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన కోవిడ్ కేసులు, మరణాలు.. కేంద్రం కీలక హెచ్చరికలు


వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రావడంతో కరోనా మహమ్మారి నుంచి బయటపడతామని ప్రపంచం సంతోషిస్తుండగా.. దక్షిణాఫ్రికాలో కొత్తరకం వేరియంట్ పుట్టుకొచ్చింది. దీంతో రూపంలో ప్రపంచానికి మరో ముప్పు ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. తగ్గుముఖం పట్టి, వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్న వేళ.. ఒమిక్రాన్ ఆందోళన మొదలైన విషయం తెలిసిందే. గత రెండు మూడు రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య వేగంగా పెరుగుతుండటంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న ఒడిశా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మిజోరాం, జమ్మూ-కశ్మీర్‌ రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ శనివారం లేఖ రాశారు. హాట్‌స్పాట్‌లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆ లేఖలో ఆయన సూచించారు. అలాగే, విదేశీ ప్రయాణికులు ముఖ్యంగా 'రిస్క్' దేశాల నుంచి వచ్చేవారిపై దృష్టి సారించాలని, పాజిటివ్‌ వచ్చినవారి శాంపిళ్లను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌కు పంపాలని రాజేశ్ భూషణ్ స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారుల కేసుల సహా ఆరోగ్య మౌలిక వసతుల సంసిద్ధతను సమీక్షించుకోవాలని తెలిపారు. జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లాలో నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 మధ్య అంతకు ముందు వారంతో పోల్చితే కొత్త కేసుల్లో పెరుగుదల 727 శాతం నమోదు కావడం గమనార్హం. అదే సమయంలో కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోనూ కేసులు 152 శాతం పెరిగాయి. తమిళనాడులోని మూడు, ఒడిశాలోని ఆరు, మిజోరాంలోని నాలుగు జిల్లాల్లోనూ కేసుల సంఖ్య భారీగా పెరిగిందని కేంద్రం హెచ్చరించింది. ఇక, కేరళలో కోవిడ్ మరణాల పెరగుదలపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. నవంబర్ 19- 25 మధ్య త్రిసూర్ జిల్లాలో 12 మరణాలు నమోదు కాగా, ఆ తరువాతి వారంలో 128కి పెరిగింది. అదే సమయంలో మళప్పురం జిల్లాలో 70 మంది చనిపోగా.. ఆ తర్వాతి వారంలో ఈ సంఖ్య 109గా నమోదయ్యింది. ప్రస్తుతం ఒమిక్రాన్‌ కలవరం నెలకొన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సంబంధిత రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. నవంబరు 3 నుంచి డిసెంబరు 3 వరకు కేరళలో 1,71,521 కేసులు నిర్ధారణ అయ్యాయని, దేశంలో గత నెల నమోదయిన కొత్త కేసుల్లో ఇవే 56 శాతంగా ఉన్నాయని ప్రస్తావించింది. కేరళలోని మొత్తం 14 జిల్లాలకుగానూ 13 జిల్లాల్లో వీక్లీ కేసులు భారీగా నమోదవుతున్నాయని పేర్కొంది. అంతేకాదు, తిరువనంతపురం (11.61 శాతం), వాయనాడ్ (11.25 శాతం), కోజికోడ్ (11 శాతం), కొట్టయాం (10.81శాతం)‌ ఈ నాలుగు జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతానికి మించి ఉంది.


By December 05, 2021 at 08:37AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/take-necessary-steps-as-covid-cases-rising-centre-alerts-to-six-states/articleshow/88100239.cms

No comments