Breaking News

సెక్స్ వర్కర్లకు ఊరటనిచ్చేలా సుప్రీంకోర్టు తీర్పు


వృత్తితో సంబంధం లేకుండా ప్రతి పౌరుడికి రాజ్యాంగ హక్కులు హామీ ఇస్తున్నాయని, సెక్స్ వర్కర్లకు ఓటర్, ఆధార్, రేషన్ కార్డులను మంజూరు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఆదేశించింది. వారికి రేషన్ అందజేయాలని సూచించింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వారి సంక్షేమం కోసం గతేడాది సెప్టెంబరు 29న జారీ చేసిన ఉత్తర్వులను మరోసారి ప్రస్తావించింది. గుర్తింపు కార్డులతో సంబంధం లేకుండా వారికి రేషన్ అందజేయాలని కేంద్రం, రాష్ట్రాలను సుప్రీంకోర్టు గత ఉత్తర్వుల్లో కోరింది. తాజాగా, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. సెక్స్ వర్కర్లకు రేషన్ కార్డులను మంజూరు చేయాలని సూచించింది. ఈ అంశంపై 2011లో సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. ‘సెక్స్ వర్కర్లకు రేషన్ కార్డులను మంజూరు చేయాలని దాదాపు దశాబ్దం కిందట రాష్ట ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు.. ఏ కారణం చేత ఆ ఉత్తర్వులను ఇప్పటి వరకూ అమలు చేయలేదు’ అని ధర్మాసనం నిలదీసింది. ‘వృత్తితో సంబంధం లేకుండా దేశంలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగ హక్కులు హామీ ఇస్తున్నాయి.. దేశంలోని పౌరులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.. రేషన్ కార్డులు, కార్డులు, ఆధార్ కార్డుల జారీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర అధికారులను ఆదేశిస్తున్నాం’అని స్పష్టం చేసింది. ఈ విషయంలో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీల సహాకారం తీసుకోవాలని పేర్కొంది. వీటి వద్ద ఉన్న వివరాల ఆధారంగా సెక్స్ వర్కర్ల జాబితాను రూపొందించాలని సూచించింది. దీనికి సంబంధించి స్టేటస్ రిపోర్టును నాలుగు వారాల్లోగా సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. అలాగే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు గుర్తింపు కార్డులతో సంబంధం లేకుండా గతంలో జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి సెక్స్ వర్కర్లకు రేషన్ అందజేయాలని ఆదేశాలు జారీచేసింది.


By December 15, 2021 at 09:34AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sc-order-to-centre-and-states-to-voter-ids-and-aadhaar-cards-for-sex-workers/articleshow/88290530.cms

No comments