కాంగ్రెస్.. బీజేపీకి టీఆర్పీ.. వాళ్లతో టైమ్ వేస్ట్.. మమతా సంచలన వ్యాఖ్యలు
పార్టీని లక్ష్యంగా చేసుకుని పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో యూపీఏ ఎక్కడుందని ప్రశ్నించిన మమతా.. ఎన్‌డీఏను ఓడించడానికి కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్షాన్ని వ్యతిరేకిస్తున్నట్టు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం ఇచ్చిన ఊపుతో జాతీయ రాజకీయాలపై దీదీ దృష్టిసారించారు. కాంగ్రెస్ స్థానాన్ని టీఎంసీ భర్తీ చేయాలన్న సంకల్పంతో ఇప్పటికే గోవా, మేఘాలయల్లో ఆ పార్టీ కీలక నేతలను తన వైపు తిప్పుకున్నారు. మరిన్ని రాష్ట్రాలపైనా కన్నేసిన మమతా బెనర్జీ.. మూడ్రోజుల పర్యటన నిమిత్తం ముంబయికి వచ్చిన ఆమె.. బుధవారం ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. ‘యూపీఏనా.. అంటే ఏంటి? యూపీఏ అనేదే లేదు’ అని మమత అన్నారు. తమ భేటీ 2024 సార్వత్రిక ఎన్నికలకు సన్నాహకంగా పవార్ అభివర్ణించారు. ప్రాంతీయ పార్టీలన్నీ కలిస్తే బీజేపీని ఓడించడం కష్టం కాదని మమత వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జరిగే ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పోటీచేయబోదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష కూటమికి సారథ్యం వహిస్తారా? అని ప్రశ్నించగా.. తాను చిన్న కార్యకర్తనేనని.. అలాగే కొనసాగుతానని సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీపైనా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘రాజకీయాల్లో నిరంతరం శ్రమించడం అవసరం. ఎక్కువ కాలం విదేశాల్లో ఉంటే లాభం లేదు’ అని ఎద్దేవా చేశారు. అంతకు ముందు మంగళవారం శివసేన నేతలు సంజయ్ రౌత్, ఆదిత్య ఠాక్రేలతో మమతా సమావేశమయ్యారు. మహారాష్టర్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే శస్త్రచికిత్స చేయించుకోవడం ఆయనను కలవడానికి వీలు కాలేదు. విపక్షాల ప్రధాని అభ్యర్థి ఎంపికను అప్పటి పరిస్థితిని బట్టి రాష్ట్రాలు నిర్ణయిస్తాయని మమత ఉద్ఘాటించారు. మా ప్రస్తుత లక్ష్యం రాజకీయంగా బీజేపీని దేశం నుంచి వెళ్లగొట్టి, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అని వివరించారు. ‘బీజేపీని ఎదుర్కోవడానికి మేము సమగ్ర వ్యూహాన్ని రూపొందించాలి.. ప్రతిపక్షం ఐక్యత అవసరం. బీజేపీకి వ్యతిరేకంగా గట్టి ప్రత్యామ్నాయం చేయాలి.. శరద్ పవార్‌తో నా భేటీ బీజేపీని ఓడించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడమేని... నాకు పవార్ గురించి తెలుసు.. ఆయనతో కలిసి పనిచేశాను’’ అని మమతా ఉద్ఘాటించారు. ‘వాళ్లు (కాంగ్రెస్) సమయం వృథా చేస్తోంది.. బీజేపీ చాలా చాలా శక్తివంతమవుతోంది.. కానీ, దానిని మేము సహించం.. గత అసెంబ్లీ ఎన్నికల్లో గోవాలో ఏం జరిగిందో చూశాం.. కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రజలు తీర్పునిస్తే.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.. బీజేపీకి కాంగ్రెస్ టీఆర్పీ.. ఇకపై ఇలాంటివి జరగడానికి అవకాశం ఇవ్వం.. ఓట్లు చీలిపోనివ్వం.. దేశం కంటే ఏ రాజకీయ పార్టీ ఎక్కువ కాదు’ అని అన్నారు. మమతా వ్యాఖ్యలపై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, బాలాసాహెబ్ థోరట్ స్పందించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే ఇగోలను పక్కనబెట్టి కలిసికట్టుగా ఉండాలి.. బీజేపీకి కాంగ్రెస్ మాత్రమే కీలకమైన ప్రత్యామ్నాయం అని అన్నారు.
By December 02, 2021 at 09:11AM
No comments