Breaking News

అమెరికాలో టోర్నడో బీభత్సం.. నేలమట్టమైన మేఫీల్డ్.. 80 మంది మృతి


అమెరికాలో బీభత్సం సృష్టించింది. ఈశాన్య రాష్ట్రంలోని కెంటకీలో టోర్నడో విళయానికి 70 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని గవర్నర్ ఆండీ బెషీర్ వెల్లడించారు. రాష్ట్రంలో సుమారు 200 మైళ్ల మేర పలు కౌంటీలను బలమైన టోర్నడో చుట్టేసిందని, కెంటకీ చరిత్రలోనే ఇది అత్యంత తీవ్రమైనదని ఆయన పేర్కొన్నారు. మృతుల సంఖ్య 100 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కొవ్వొత్తుల తయారీ ఫ్యాక్టరీ పైకప్పు కుప్పకూలడంతో భారీగా ప్రాణ నష్టం జరిగిందన్నారు. ఆ సమయంలో 100 మందికిపైగా కార్మికులు ఫ్యాక్టరీలో ఉన్నారని తెలిపారు. శుక్రవారం రాత్రి అత్యంత దుర్భరమైనదిగా ఆయన అభివర్ణించారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించారు. సహాయక చర్యల కోసం 180 మంది సిబ్బందిని రంగంలోకి దించామని, శిథిలాల తొలగింపు కొనసాగుతోందని చెప్పారు. కర్మాగార శిథిలాల్లో రెండు గంటలకుపైగా చిక్కుకుపోయిన ఉద్యోగిని పార్సన్స్‌ పెరెజ్‌ ప్రాణాలతో బయటపడ్డారు. ఆమెను గ్రేవ్స్‌ కౌంటీ జైలు ఖైదీలు కాపాడటం విశేషం. అవకాశం లభించినా పారిపోకుండా తన లాంటివారికి సాయంపడటం పట్ల ఖైదీలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. టోర్నడో ఆరు రాష్ట్రాలపై విరుచుకుపడింది. ఇల్లినాయిస్‌లోని అమెజాన్ గిడ్డంగి పైకప్పు ఎగిరిపోయి, భారీ గోడ కూలి ఆరుగురు ఉద్యోగులు చనిపోయారు. మిస్సౌరి, మిసిసిపి, ఆర్కాన్సాస్‌, టెన్నెసీలపైనా టోర్నడో విరుచుకుపడింది. విద్యుత్తు సరఫరా స్తంభించిపోయి దాదాపు 3 లక్షలమంది అంధకారంలో చిక్కుకుపోయారు. అత్యవసరమైతే తప్పిస్తే బయటకు రావద్దని పలుచోట్ల అధికారులు విజ్ఞప్తి చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తాజా పరిస్థితిని సమీక్షించారు. కెంటకీలోని మేఫీల్డ్ టోర్నడో ధాటికి చిగురుటాకులా వణికిపోయింది. 10,000 మంది జనాభా ఉన్న చిన్న పట్టణంలో చారిత్రాత్మక నిర్మాణాలు, భవనాలు నేలమట్టమయ్యాయి. చెట్లు కూలిపోయి, పొలాల్లో కార్లు బోల్తా పడ్డాయి. బౌలింగ్‌ గ్రీన్‌ ప్రాంతంలో అనేక అపార్ట్‌మెంట్లు భారీగా దెబ్బతిన్నాయి. కొన్ని కర్మాగారాలు కూలిపోయాయి. రహదారులపై శిథిలమయ్యాయి.‘ ‘ఇది వర్ణించలేనిది.. ఇంతటి వినాశనం నేను ఎప్పుడూ చూడలేదు’ అని కెంటకీ గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇది కెంటకీపై ఇప్పటివరకు విరుచుకుపడి అత్యంత ఘోరమైన టోర్నడో అని నేను నమ్ముతున్నాను’ అన్నారు. మేఫీల్డ్ గుండా విరుచుకుపడిన టోర్నడో వేగం గంటకు 200- 227 మైళ్లు ఉంటుందని అంచనా. అమెరికా చరిత్రలో ఇంతకుముందు 1925లో మిస్సౌరీపై గంటకు 219మైళ్ల వేగంతో శక్తివంతమైన టోర్నడో విరుచుకుపడి 695 మంది ప్రాణాలను బలిగొంది.


By December 12, 2021 at 07:41AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/powerful-tornadoes-hits-six-states-in-us-and-kill-at-least-78/articleshow/88233163.cms

No comments