Breaking News

విజయవంతంగా నింగిలోకి జేమ్స్ వెబ్.. 1350 కోట్ల ఏళ్ల వెనక్కి చూసే టైం మెషీన్‌


విశ్వం పుట్టుక రహస్యాన్ని తెలుసుకునే క్రమంలో శాస్త్రవేత్తలు మరో కీలక విజయాన్ని సాధించారు. అనంత విశ్వం గురించి శోధించేందుకు 29 దేశాలకు చెందిన వేలాది మంది శాస్త్రవేత్తలు 25 ఏళ్లపాటు శ్రమించి రూపొందించిన జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ శనివారం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. రూ.75 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు అంతరిక్ష పరిశోధన చరిత్రలోనే అతి పెద్దది కావడం విశేషం. ఐరోపా, కెనడా అంతరిక్ష సంస్థలతో కలిసి రూపొందించిన ఈ వెబ్ టెలిస్కోప్‌ను దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్‌ గయానా తీరం నుంచి యూరోపియన్‌ అరియానీ రాకెట్‌ ద్వారా ప్రయోగించారు. నెలరోజుల పాటు ఈ రాకెట్ ప్రయాణించి, భూమి నుంచి 15 లక్షల మైళ్ల దూరానికి చేరనుంది. అనంతరం టెలిస్కోప్‌ పనితీరు ప్రారంభం కావడానికి మరో 5 నెలలు పడుతుందని నాసా పరిశోధకులు తెలిపారు. రాకెట్‌లో ప్రయాణానికి అనువుగా ఉండేందుకు చిన్నదిగా చేశామని.. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత అసలు స్థాయికి విచ్చుకుంటుందని వివరించారు. ‘‘విశ్వం గురించి మరింత సమాచారం.. ఈ అనంతంలో మన స్థానాన్ని జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ అందిస్తుంది’’ అని నాసా స్పష్టం చేసింది. విశ్వం పుట్టుకతో పాటు ఏలియన్స్‌ జాడ కూడా తెలిసే అవకాశముందని అంటోంది నాసా. విశ్వం గుట్టు తెలుసుకోడానికి ఇప్పటి వరకూ ఎన్నో ఉపగ్రహాలను పంపారు. హబుల్ వంటి టెలిస్కోప్‌ల సాయంతో ఖగోళ రహస్యాలను శోధించారు. తాజాగా ఆఅన్వేషణలో జేమ్స్‌ వెబ్ టెలిస్కోప్‌తో మరో ముందడుగు పడింది బిగ్‌ బ్యాంగ్‌ తర్వాత పరిణామాలు, గెలాక్సీల పుట్టుక, విశ్వ ఆవిర్భావ సంగతుల్ని శోధించేందుకు జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ పనిచేయనుంది. కంటే మరిన్ని రహస్యాలను తెలియజేస్తుందా? అని సైంటిస్టులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 1960ల్లో నాసా పరిశోధనలకు నేతృత్వం వహించిన జేమ్స్‌ వెబ్‌ పేరును ఈ టెలిస్కో‌ప్‌నకు పెట్టారు. వాస్తవానికి ఈ ప్రయోగాన్ని శుక్రవారమే నిర్వహించాల్సి ఉండగా.. వాతావారణం అనుకూలించపోవడంతో క్రిస్మస్‌ రోజు నిర్వహించారు. మొత్తం 70 అడుగుల పొడవు, 46 అడుగుల వెడల్పుతో ఒక టెన్నిస్‌ కోర్టు పరిమాణంలో ఉండే ఈ టెలిస్కోప్.. బంగారుపూత పూసిన దాని అద్దమే 6.5 మీటర్లు (21 అడుగులు) వెడల్పు ఉంది. వీటిని అత్యంత తేలికపాటి బెరీలియం మూలకంతో తయారుచేశారు. టెలిస్కోప్‌ను రక్షించేందుకు ఐదు పొరలు కలిగిన భారీ కవచాన్ని ఏర్పాటు చేశారు. ‘విశ్వ పరిణామాన్ని పరిశోధించడంతో పాటు.. నివాసయోగ్యమై గ్రహాలు.. వాటిపై జీవజాడలను ఈ టెలిస్కోపు అన్వేషిస్తుంది.. ఇది ఎంత సున్నితమైనదంటే.. భూమి నుంచి చంద్రుడికి మధ్య ఉన్నంత దూరంలో ఓ తుమ్మెద ఉంటే.. దాని శరీర ఉష్ణోగ్రతలను గుర్తించగలదు... 1350 కోట్ల సంవత్సరాల కిందట విశ్వంలో జరిగిన విషయాలను చూసే ఓ టైమ్‌ మెషీన్‌ ఇది.. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే 3 రోజుల్లోనే కవచం తెరచుకుని, ఐదు రోజుల్లో దాని స్థానానికి చేరుకుంటుంది. ప్రయాణం మొదలైన 12 రోజులకు అద్దాలు కూడా చిన్న చిన్న ఆకుల్లా ఒక్కొక్కటిగా విచ్చుకుంటాయి.. వందలాది యంత్రాలు ఏకతాటిపై పనిచేసి, సరైన సమయానికి కచ్చితంగా స్పందిస్తేనే జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ విజయవంతంగా పనిచేయగలదు.. ఇది మేము మునుపెన్నడూ చేయని ఒక సాహసం’’ అని నాసా ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ గ్రెగ్‌ రాబిన్‌సన్‌ తెలిపారు. కనీసం పదేళ్ల పాటు జేమ్స్‌ వెబ్‌ సేవలందిస్తుందని నాసా అంచనా వేస్తోంది. ‘ఇది చాలా అద్బుతమైన రోజు.. నిజమైన క్రిస్మస్’ అంటూ నాసా సైంటిఫిక్ మెషీన్ హెడ్ థామస్ జుర్బుచెన్ అన్నారు. టెలిస్కోప్‌ను రాకెట్ 120 కిలోమీటర్లు మోసుకెళ్లిన తర్వాత ‘ఫెయిరింగ్’ అని పిలిచే రక్షిత కవచం.. దాని భారాన్ని తగ్గించేలా మార్పు చెందుతుంది. ఆ దశలో ఒత్తిడి నుంచి సున్నితమైన ఈ పరికరాన్ని రక్షించడానికి ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు.


By December 26, 2021 at 08:53AM


Read More https://telugu.samayam.com/latest-news/science-technology/worlds-most-powerful-space-telescope-james-webb-space-blasted-off-into-orbit/articleshow/88499888.cms

No comments