చనిపోయాడకుని మరో పెళ్లి చేసుకున్న భార్య.. 12 ఏళ్ల తర్వాత పాక్‌లో అలా!
పన్నెండేళ్ల కిందట కిందట అదృశ్యమైన వ్యక్తి గురించి కుటుంబసభ్యులు చాలా రోజులపాటు వెతికితారు. చివరికి అతడి ఆచూకీ దొరక్కపోవడంతో చనిపోయాడని భావించి శ్రాద్ధ కర్మలు కూడా పూర్తి చేశారు. అప్పటికే వివాహం కావడంతో భర్త ఇక లేడని.. రెండేళ్ల తర్వాత అతడి భార్య మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే, ఇప్పుడు అనూహ్యంగా అతడి జాడ తెలిసింది. పాకిస్థాన్ జైలులో బందీగా ఉన్నట్టు సమాచారం అందడంతో కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేవు. ఈ ఘటన బిహార్‌లోని బక్సర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఖిలాఫత్‌పుర్ గ్రామానికి చెంది ఛావీ ముశాహర్.. 12 ఏళ్ల క్రితం అదృశ్యమయ్యారు. అప్పటికి అతడి వయసు 18 ఏళ్లు కాగా.. వివాహమై భార్య కూడా ఉంది. ఛావీ గురించి చుట్టుపక్కల గాలించిన కుటుంబసభ్యులు.. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయినా ఆచూకీ దొరకలేదు. దీంతో చనిపోయి ఉంటాడని భావించారు. ఇప్పుడు పాకిస్థాన్‌లోని ఓ జైలులో బందీగా ఉన్నట్టు తెలిసింది. పాక్ జైలులో ఉన్న ఓ వ్యక్తిని గుర్తించాలంటూ భారత విదేశాంగశాఖ నుంచి ముఫాసిల్ పోలీస్ స్టేషన్‌కు లేఖ అందింది. ఖిలాఫత్‌పుర్ దళితవాడకు చేరుకున్న పోలీసులు ఆ ఊరంతా ఆరా తీశారు. అది 12 ఏళ్ల క్రితం అదృశ్యమైన ఛావీ ముశాహర్‌గా కుటుంబసభ్యులు గుర్తించారు. తన కుమారుణ్ని వెంటనే సురక్షితంగా తీసుకురావాలని ఛావీ తల్లి ప్రభుత్వాన్ని కోరుతోంది. ఇంటి నుంచి వెళ్లిపోయే సమయానికి ఛావీ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని తెలిపారు. తమ కుమారుడు బతికే ఉన్నాడని తెలియడంతో తల్లిదండ్రులు సంతోషానికి పట్టపగ్గాల్లేవు. అయితే, ఛావీ ఎలా సరిహద్దులను దాటి, పాకిస్థాన్ సైన్యానికి పట్టుబడ్డాడనేది తెలియాల్సి ఉంది. ఛావీ చనిపోయి ఉంటాడని భావించి కుటుంబసభ్యులు అతడికి కర్మలు కూడా నిర్వహించారని పోలీసులు తెలిపారు. పాక్ సైన్యానికి ఎక్కడ పట్టుబడ్డాడనేది తెలియదని అన్నారు. జైలు నుంచి వీలైనంత త్వరగా విడుదలకు విచారణ జరిపి నివేదికను సమర్పించినట్టు పేర్కొన్నారు. ఛావీ తండ్రి చనిపోగా.. తల్లి, సోదరుడు ఉన్నారని, భార్య మరో వ్యక్తిని పెళ్లిచేసుకుందని చెప్పారు.
By December 18, 2021 at 10:10AM
No comments