Breaking News

కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం.. నిన్న ఒక్క రోజే 12 వేల బాతులను చంపేసిన అధికారులు


దేశంలో కరోనా కొత్తరకం వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతుండగా.. మరోవైపు కేరళలో బర్డ్‌‌ఫ్లూ విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దేశంలోనే అత్యధిక కరోనా కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి. కోవిడ్-19తో అల్లాడుతున్న కేరళలో బర్డ్ ఫ్లూ నిర్థారణ కావడం ఇది రెండోసారి. అలప్పుజ జిల్లాలో బర్డ్‌ఫ్లూ కేసులు నిర్ధారణ కావడంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. బాతులు, కోళ్లను చంపాలని నిర్ణయించింది. మాంసం విక్రయాలపై నిషేధాజ్ఞలు విధించారు. తకాళి గ్రామ పంచాయితీ పరిధితో పాటు హరిప్పడ్‌ మునన్సిపాలిటీలోనూ ఈ వైరస్‌ను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. నియంత్రణ కోసం ర్యాపిడ్‌ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. బర్డ్‌ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్ని కంటెయిన్‌మెంట్ జోన్లుగా ప్రకటించిన అధికారులు.. వాహనాలు, ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించారు. తకాళి గ్రామ పంచాయతీలోని పదో వార్డులో శుక్రవారం 12వేల బాతులను అధికారులు చంపేశారు. పదో వార్డులోనే కేసులు నిర్ధారణ కావడంతో కంటెయిన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. అలాగే, వివిధ ప్రాంతాల నుంచి నమూనాలను సేకరించి పరీక్షల కోసం భోపాల్‌లోని ల్యాబొరేటరీకి పంపారు. జిల్లా కలెక్టర్ శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. బర్డ్‌ఫ్లూ వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తకాళిలోని పదో వార్డుకు కిలోమీటరు పరిధిలోని బాతులను చంపేయాలని నిర్ణయించారు. సామాజిక కార్యకర్తల సహకారంతో ఆ ప్రాంతంలో నిఘా ఉంచాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. మరోవైపు, సరిహద్దు జిల్లాల్లో బర్డ్‌ ఫ్లూ ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. వైరస్‌ ప్రభావిత ప్రాంతాల్లో కిలోమీటరు పరిధిలో ఉన్న బాతులు, కోళ్లు, ఇతర పక్షులను చంపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, వలస పక్షులకు వైరస్‌ సోకిందో? లేదో నిర్ధారించాలని అసిస్టెంట్ ఫారెస్ట్ కన్జర్వేటర్‌కు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా జిల్లాలో బర్డ్ ఫ్లూ నివారణ చర్యలపై రోజువారీ నివేదిక సమర్పించాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు సూచించారు.


By December 11, 2021 at 09:50AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/amid-bird-flu-scare-and-12000-ducks-culled-at-alappuzha-in-kerala/articleshow/88218741.cms

No comments