Breaking News

‘ఒమిక్రాన్’.. పీసీఆర్ పరీక్షలతోనే గుర్తించవచ్చా? WHO ఏమంటోంది


దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్‌తో ప్రపంచం మరోసారి కలవరపడుతోంది. ఈ నేపథ్యంలో వేరియంట్‌ను పీసీఆర్ (PCR) పరీక్షలతోనే గుర్తించగలిగినప్పటికీ ఇతర పరీక్షలపై ఏమైనా ప్రభావం చూపుతుందా? అనే దిశగా అధ్యయనాలు కొనసాగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇతర వేరియంట్లను నిర్దారించడానికి విస్తృతంగా ఉపయోగించే PCR పరీక్షలతోనే Omicronను గుర్తించవచ్చని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ర్యాపిడ్ యాంటిజెన్ డిటెక్షన్ పరీక్షలతో సహా ఇతర రకాల పరీక్షలపై ఏదైనా ప్రభావం ఉందో లేదో తెలుసుకోవడానికి అధ్యయనాలు కొనసాగుతున్నాయని చెప్పింది. ఈ నెల తొలివారంలో దక్షిణాఫ్రికాలో బయటపడిన ఒమిక్రాన్‌ను ఆందోళనకర వేరియంట్‌గా డబ్ల్యూహెచ్ఓ శుక్రవారం ప్రకటించింది. కోవిడ్ వ్యాక్సిన్‌లు, పరీక్షలు, వ్యాప్తి, తీవ్రత, సమస్యలు, ఏవైనా మార్పులు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఓమిక్రాన్‌పై అధ్యయనానికి చాలా వారాలు పడుతుందని తెలిపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇతర వేరియంట్లతో పోల్చితే ఒమిక్రాన్ రీ-ఇన్‌ఫెక్షన్ ముప్పు ఎక్కువేనని పేర్కొంది దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఈ వేరియంట్‌ను ‘B.1.1.529’గా శాస్త్రవేత్తలు గుర్తించారు. గౌతెంగ్‌ ప్రావిన్సులో ఇది వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు స్థానిక వైద్య నిపుణులు వెల్లడించారు. ఇక్కడ నమోదయిన కేసులకు 90% ఈ వేరియంటే కారణమని తెలిపారు. మరో ఎనిమిది ప్రావిన్సుల్లోనూ ఈ వేరియంట్‌ వ్యాపించి ఉండవచ్చని తెలుస్తోంది. కొవిడ్‌ టీకా రెండు డోసులు తీసుకున్నవారికీ ఈ వేరియంట్‌ సోకుతుండటంతో ప్రపంచం ఉలిక్కిపడుతోంది. అధిక మ్యూటేషన్ల కారణంగా డెల్టా కంటే ఇది ప్రమాదకారి కావచ్చని..వేగంగా వ్యాపించి, తీవ్ర లక్షణాలకు దారితీయవచ్చని నిపుణులు కలవరపడుతున్నారు. భారత్‌లో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌కి కారణమైన డెల్టా వేరియంట్ కంటే ఈ వేరియంట్ ఆరు రెట్లు ప్రమాదకరం అని చెబుతున్నారు నిపుణులు. కరోనా మహమ్మారి కట్టడికి ఇప్పటికే పలు దేశాలు ఆంక్షలు విధిస్తుండగా.. సరిహద్దులను కూడా ఇప్పటికే మూసివేస్తున్నాయి. కొత్త వేరియంట్‌ ఉద్ధృతి నేపథ్యంలో కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది.


By November 29, 2021 at 10:35AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/omicron-covid-variant-be-detected-using-pcr-testing-who-says/articleshow/87973580.cms

No comments