Breaking News

కొత్త వేరియంట్‌లో అసాధారణ మ్యుటేషన్లు.. WHO సంచలన ప్రకటన


ఐరోపాలో మరోసారి కరోనా కల్లోలం కొనసాగుతుండగా.. దక్షిణాఫ్రికాలో బయటపడటం ఆందోళన వ్యక్తమవుతోంది. దక్షిణాఫ్రికా, బోట్సవానాలో బయటపడిన B.1.1529 రకం వేరియంట్ అసాధారణ రీతిలో మ్యుటేషన్ చెందుతున్నట్టు గుర్తించారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అధికారులు గురువారం అత్యవసరంగా సమావేశమై చర్చించారు. B.1.1529 వేరియంట్ అసాధారణంగా పెద్ద సంఖ్యలో ఉత్పరివర్తనాలను కలిగి ఉందని యూసీఎల్ జెనెటిక్స్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ బల్లౌక్స్ అన్నారు. ఈ వేరియంట్ రోగనిరోధక వ్యవస్థను ఏమార్చి వ్యాప్తిచెందుతున్నట్టు పేర్కొన్నారు. దీర్ఘకాలిక సంక్రమణ సమయంలో రోగనిరోధక శక్తి తగ్గిన వ్యక్తిలో బహుశా చికిత్స తీసుకోని HIV/AIDS రోగిలో కొత్తరకం పుట్టి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సైన్స్ మీడియా సెంటర్‌లోని ఓ ప్రకటన ఇచ్చారు. ఇది ఎంతవరకు వ్యాప్తి చెందుతుందో ఈ దశలో అంచనా వేయడం కష్టమని బల్లౌక్స్ చెప్పారు. ‘ప్రస్తుతానికి దీనిని నిశితంగా పరిశీలించి.. విశ్లేషించాలి రాబోయే రోజుల్లో వ్యాప్తి పెరగడం ప్రారంభిస్తే తప్ప అతిగా ఆందోళన చెందడానికి ఎటువంటి కారణం లేదు’ అని అన్నారు. దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకూ 22 కేసులను గుర్తించినట్టు దక్షిణాఫ్రికా జాతీయ అంటువ్యాధుల కేంద్రం (NICD) తెలిపింది. అయితే, కొత్తరకం వేరియంట్ బయటపడటం తమకేమీ ఆశ్చర్యం కలిగించలేదని NICD ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అదిరియన్ పూరేన్ అన్నారు. ‘డేటా పరిమితంగా ఉన్నప్పటికీ కొత్త వేరియంట్‌, దాని తీవ్రతను అర్థం చేసుకోవడానికి మా నిపుణులు అన్ని విధాలుగా పని చేస్తున్నారు.. దీనికి సంబంధించిన పరిశీలనలు శరవేగంగా జరుగుతున్నాయి.. సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచుతామని హామీ ఇస్తున్నాం’ అన్నారు. మరోవైపు, దక్షిణాఫ్రికా అధికారులతో వచ్చేవారం సమావేశమై వేరియంట్‌పై చర్చిస్తామని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది.


By November 26, 2021 at 09:58AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/new-variant-in-south-africa-with-unusual-mutations-focus-of-who-meet/articleshow/87923263.cms

No comments