Breaking News

Scrap Babu పాత సామాన్లు అమ్ముకున్న వ్యక్తి.. నేడు వేల కోట్లకు అధిపతి!


నిన్న మొన్నటి దాకా పాత ఇనప సామాన్ల అమ్ముకున్న వ్యక్తి వేల కోట్లకు పడగలెత్తడం.. కర్ణాటకలోనే శ్రీమంతులైన రాజకీయ నేతల జాబితాలో చేరడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీచేయడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయనే యూసుఫ్‌ షరీఫ్‌ అలియాస్‌ కేజీఎఫ్‌ బాబు. శాసనమండలి ఎన్నికల్లో బెంగళూరు అర్బన్ నుంచి పోటీచేస్తున్న ఆయన మంగళవారం నామినేషన్‌ పత్రాల దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తుల విలువన అందులో వెల్లడించారు. రూ.1,643 కోట్ల స్థిరాస్తి, రూ.97 కోట్ల చరాస్తి ఉందని అఫిడ్‌విట్‌లో పేర్కొన్నారు. యూసుఫ్‌ షరీఫ్‌ కేజీఎఫ్‌(కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌) కేంద్రంగా చాలాకాలం పాత సామాన్లు వ్యాపారం చేశారు. కేజీఎఫ్‌లో పాత ట్యాంకలను కొనుగోలు చేయడం, వాటిని అమ్మడం చేసేవారు. ఈ వ్యాపారం బాగా కలిసి రావడంతో ఆయన పేరూ‘కేజీఎఫ్‌ బాబు’గా మారిపోయింది. ఆ తర్వాత బెంగళూరుకు మకాం మార్చి.. సామ్రాజ్యానని విస్తరించారు. స్థిరాస్తి రంగంలోకి అడుగుపెట్టిన ఆయన పట్టిందల్లా బంగారమయ్యింది. మొత్తం 23 బ్యాంకు ఖాతాలు ఉన్న బాబుకు రూ.3 కోట్ల విలువైన మూడు కార్లు, రూ.1.11 కోట్ల వాచీ, 4.5 కిలోల బంగారం, ఒక్కోటి రూ.లక్ష విలువ చేసే నాలుగు మొబైల్ ఫోన్లు, మూడు చోట్ల రూ.48 కోట్ల విలువైన వ్యవసాయ భూములు, రూ.1,593 కోట్ల విలువైన చేసే 26 స్థలాలు, రూ.3 కోట్ల విలువైన ఇల్లు ఉన్నాయి. రూ.58 కోట్ల రుణాలూ ఉన్నాయి. బాబుకు ఇద్దరు భార్యలుండగా.. మొదటి భార్య వద్ద రూ.77.15 లక్షలు, రెండో భార్య వద్ద రూ.30.37 లక్షలు, కుమార్తె వద్ద రూ.58.73 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నాయని అఫిడ్‌విట్‌లో పేర్కొన్నారు. బిగ్‌బీ అమితాబ్‌ నుంచి రూ.2.01 కోట్ల విలువైన రోల్స్‌ రాయిస్‌ కారును కొన్నేళ్ల కిందట ఆయన కొనుగోలు చేసి వార్తల్లోకి ఎక్కారు. పాత సామాన్ల వ్యాపారం చేస్తోన్న యూసఫ్ షరీఫ్‌కి 2001లో అదృష్టం కలిసొచ్చింది. బంగారాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగించే 21 ట్యాంకర్లను వేలం వేయాలని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నిర్ణయించింది. ఈ వేలంలో ట్యాంకర్లను యూసఫ్ రూ.7 లక్షలకు దక్కించుకున్నారు. బ్రిటిష్ కాలం నాటి ఈ మిల్ ట్యాంక్‌లను కొనుగోలు చేసిన తర్వాత దశ మారిపోయింది. అయితే, అందులోని ఓ ట్యాంక్‌లో 13 కిలోల బంగారం లభించింది. ‘కేజీఎఫ్ కార్మికులు రసాయనాలు, పాదరసం ద్వారా బంగారాన్ని శుద్ధి చేస్తుండగా, ట్యాంకర్ కాంక్రీటులోకి చేరింది.. నేను దానిని కనుగొనే వరకు ఎవరికీ తెలియదు .. నాకు కూడా తెలియదు. బంగారం దొరికిన రోజే నా భార్య నా కూతురుకు జన్మనిచ్చింది. నా షాపులో పనిచేసే కార్మికులందరికీ ఆ రోజు సెలవు ఇచ్చి ఇంటికి పంపించాను’ అని యూసఫ్ అప్పట్లో మీడియాతో అన్నారు. మొత్తం అప్పటి విలువ ప్రకారం రూ.5.59 కోట్ల విలువైన బంగారం దక్కింది.


By November 25, 2021 at 09:32AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/scrap-dealer-kgf-babu-yusuf-shariff-congress-mlc-ticket-in-karnataka/articleshow/87902221.cms

No comments