Omicron మరింత డేంజర్.. అప్రమత్తంగా ఉండాలి.. మరోసారి డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్తరకం వేరియంట్ మరోసారి ప్రపంచానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రపంచ మేల్కొనేలోపు పలు దేశాలకు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిచెందడం ఆందోళన కలిగిస్తోంది. ఇది డెల్టా కంటే ప్రమాదకరమైన వేరియంట్ అని, అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయాసియా విభాగం తాజాగా హెచ్చరించింది. నిఘా పెంచాలని, ప్రజారోగ్య వ్యవస్థల్ని బలోపేతం చేయాలని ఆగ్నేయాసియా ప్రాంత డైరెక్టర్ డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ సూచించారు. కొవిడ్ వ్యాక్సినేషన్‌ని మరింత వేగవంతం చేయడం సహా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేలా కఠిన చర్యలు చేపట్టాలని తెలిపారు. కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో మనం ఇంకా చాలా దూరంలో ఉన్నామనే విషయాన్ని మరచిపోవద్దన్నారు. కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటాయని సంతృప్తి చెందకూడదని వివరించారు. పండుగలు, వేడుకల్ని కొవిడ్ నిబంధనలకు లోబడి నిర్వహించుకోవాలని, భౌతికదూరం పాటించడంతో పాటు జనసమూహాలకు దూరంగా ఉండాలని ఆమె సూచించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ కొవిడ్ నిబంధనల పట్ల అలసత్వం ప్రదర్శించరాదని ఉద్ఘాటించారు. ఆగ్నేయాసియా ప్రాంతంలోని పలు దేశాల్లో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ మిగతా చోట్ల వైరస్ విజృంభిస్తుండటం, కొత్త వేరియంట్లతో ఆందోళనలు నిరంతర ప్రమాదాన్ని గుర్తు చేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ వేరియంట్ నుంచి మనల్ని మనం కాపాడుకునేలా.. దాని వ్యాప్తిని నిరోధించేందుకు కృషిచేయాలని ఖేత్రపాల్ పిలుపునిచ్చారు. ఒమిక్రాన్‌పై ఆయా దేశాలు నిఘా పెంచాలని ఆమె సూచించారు. కొత్త వేరియంట్లు, వాటి వ్యాప్తిపై సమాచారం ఆధారంగా అంతర్జాతీయ ప్రయాణాల ద్వారా ప్రమాదాన్ని అంచనా వేసి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వైరస్ నుంచి రక్షణ పొందేందుకు ముక్కు నోరును కప్పి ఉంచేలా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, జనసమూహాలకు దూరంగా ఉండటం, చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, వెలుతురులేని గదులకు దూరంగా ఉండటం, వ్యాక్సినేషన్ వేయించుకోవడం వంటివి కచ్చితంగా పాటించాలని సూచించారు. ఇప్పటివరకు ఆగ్నేయాసియా జనాభాలో 31 శాతం మంది పూర్తిస్థాయి.. 21శాతం మందికి పాక్షికంగానే టీకా అందిందన్నారు. మిగతా 48 శాతం మంది ఇంకా టీకా వేయించుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. అలాంటి వాళ్లకు ఈ మహమ్మారి ముప్పు అధికంగా ఉంటుందని ఆమె హెచ్చరించారు. వ్యాక్సిన్ వేయించుకున్నా ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని డాక్టర్ ఖేత్రపాల్ సింగ్ పునరుద్ఘాటించారు.
By November 28, 2021 at 07:35AM
No comments