Breaking News

Lijomol Jose : ఎలుకలు పట్టడంలో ట్రైనింగ్.. ఎలుక మాంసం రుచి చూసిన హీరోయిన్


నేటి త‌రంలో హీరోయిన్స్‌ను సాధార‌ణంగా ప్రేక్ష‌కులు గ్లామ‌ర్ కోణంలోనే ఎక్కువ‌గా ఊహించుకుంటారు. అతి త‌క్కువ మంది మాత్ర‌మే త‌మ పెర్ఫామెన్స్‌తో ఎవ‌రూ ఊహించ‌ని పాత్ర‌ల్లో న‌టించి ఆక‌ట్టుకుంటుంటారు. అలా ఆక‌ట్టుకున్న రీసెంట్ టైమ్ హీరోయిన్ లిజో మోల్ జోస్‌. త‌మిళ‌నాడులో జ‌రిగిన నిజ‌ఘ‌ట‌న‌ను ఆధారంగా చేసుకుని రూపొందిన చిత్రం జై భీమ్‌. హీరో ఈ సినిమాను భార్య జ్యోతిక‌తో క‌లిసి నిర్మించ‌డ‌మే కాదు.. అందులో లాయ‌ర్ చంద్రు పాత్ర‌లో న‌టించి ప్ర‌శంస‌లు కూడా అందుకున్నారు. సూర్య పాత్ర సినిమాలో ఎంత కీల‌కంగా ఉంటుందో..పోలీస్ లాక‌ప్‌లో చ‌నిపోయిన బాధితుడు రాజ‌న్న భార్య సిన‌త‌ల్లి పాత్ర‌లో న‌టించిన మ‌ల‌యాళ సుంద‌రి పాత్ర‌కు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే సూర్య పాత్ర కంటే ఈమె పాత్రే సినిమాలో ప్రధాన‌మైంది. ఈ పాత్ర‌లో న‌టించ‌డానికి లిజోమోల్ జోస్ చాలా క‌ష్ట‌ప‌డింద‌ని రీసెంట్‌గా జ‌రిగిన ఓ ఇంట‌ర్వ్యూలో తెలిసింది. ‘‘ సినిమా క‌థ‌ను డైరెక్ట‌ర్ జ్ఞాన‌వేల్ చెప్ప‌గానే పాత్ర‌లోని ఇన్‌టెన్సిటీ ఎంటో అర్థ‌మైంది. పాత్ర చాలా బాగా న‌చ్చింది. దీంతో పాత్ర కోసం ఎంతైనా క‌ష్ట‌ప‌డాల‌ని నిర్ణ‌యించుకున్నాను. అందులో భాగంగా, డైటింగ్ చేసి బ‌రువు కూడా త‌గ్గాను. అలాగే నేను చేసింది గిరిజ‌న స్త్రీ పాత్ర‌. అంత సుల‌భంగా చేయ‌లేం. కాబ‌ట్టి గిరిజ‌న తెగ‌కు చెందిన మ‌హిళ‌ల‌ను క‌లుసుకుని వారితో కొన్ని రోజ‌లు గ‌డిపాను. వాళ్లు పాము కాటుకు ఎలా చికిత్స చేస్తారు. ఆ స‌మ‌యంలో ఏ ఔష‌ధాల‌ను ఉప‌యోగిస్తార‌నే విష‌యాల‌ను కూడా వారి నుంచి తెలుసుకున్నాను. అంతే కాకుండా.. వారితో క‌లిసి ఎలుక‌లు ప‌ట్ట‌డానికి కూడా వెళ్లి, వారెలా ప‌డుతున్నారో ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. ఓసారి ఎలుక మాంసం కూడా రుచి చూశాను’’ అని తెలిపారు లిజో మోల్ జోస్. సామాజిక అసమానతలను ప్రశ్నించేలా రూపొందిన చిత్రం జై భీమ్. ఈ సినిమా ఇటీవ‌లే డైరెక్ట్‌గా ఓటీటీలో విడుద‌లైంది. ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న చిత్ర‌మిది. అంతే కాదండోయ్‌..రాజ‌కీయ ప‌ర‌మైన విమ‌ర్శ‌లు కూడా ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. హీరో సూర్య త‌మ సంఘాన్ని అవ‌మానించారంటూ వ‌న్నియార్‌లు ఆయ‌న‌పై కేసు పెట్టి ఐదు కోట్ల రూపాయ‌ల‌ను డిమాండ్ చేశారు. సూర్య దాడి చేస్తే ల‌క్ష రూపాయ‌లు కూడా ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే తన‌కు సినిమాల ద్వారా ఎవ‌రినీ కించ‌ప‌రిచే ఉద్దేశం లేద‌ని సూర్య తెలిపారు. ఈ సినిమా విడుద‌ల ముందు గిరిజ‌న విద్య కోసం ముఖ్యమంత్రి స్టాలిన్‌ను క‌లిసి కోటి రూపాయ‌ల‌ను విరాళంగా అందిచిన సూర్య‌, విడుద‌ల త‌ర్వాత జై భీమ్ సినిమాకు స్ఫూర్తినిచ్చిన నిజ‌మైన సిన‌తల్లికి ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్థిక సాయాన్ని కూడా అందించారు.


By November 21, 2021 at 11:34AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/lijomol-jose-told-her-experience-in-jai-bhim-recent-interview/articleshow/87828738.cms

No comments