Breaking News

Farm Laws ప్రధాని ఆకస్మిక ప్రకటనతో నా నోట మాట రాలేదు.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు


నూతన సాగు చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై సీనియర్ నేత ఉమాభారతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మికంగా చేసిన ప్రకటనతో తనకు నోటి మాట రాలేదని ఆమె అన్నారు. చట్టాల ప్రయోజనాలను రైతులకు సరిగ్గా వివరించడంలో పార్టీ కార్యకర్తలు వైఫల్యాన్ని ఈ చర్యను ప్రతిబింబిస్తోందని ఈ మేరకు ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలూ దేశంలోని రైతులను సంతృప్తిపరచలేకపోయాయని ఆమె పేర్కొన్నారు. ‘‘గత నాలుగు రోజుల నుంచి వారణాసిలోని గంగా నది ఒడ్డున ఉన్నాను... మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్టు నవంబరు 19న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనతో నోటిమాట రాలేదు.. కాబట్టి మూడు రోజుల తర్వాత నేను ఆలస్యంగా స్పందిస్తున్నాను’’అని ఆమె ట్వీట్ చేశారు. మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రకటన చేస్తున్నప్పుడు ప్రధానమంత్రి చెప్పిన విషయాలు తనను బాధకు గురిచేసిందని అన్నారు. ‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతులకు వ్యవసాయ చట్టాల ప్రాముఖ్యతను వివరించలేకపోతే అది బీజేపీ కార్యకర్తలమైన మన అసమర్ధత.. ఎందుకు మనం రైతులకు చట్టాల ప్రాముఖ్యత సరిగ్గా తెలియజేయలేకపోయాం’’ అని ఆమె నిలదీశారు. ప్రధాని లోతుగా ఆలోచించి.. సమస్యను పరిష్కరించడానికి దాని మూలాల్లోకి వెళతారు. ‘‘వ్యవసాయ చట్టాలకు సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న నిరంతర ప్రచారాన్ని ఎదుర్కోలేకపోయాం.. అందుకే ఆ రోజు ప్రధాని చేసిన ప్రసంగం చూసి చాలా బాధపడ్డాను’ అని ఆమె మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను.. మా సోదరులిద్దరూ ఇప్పటికీ సాగుపైనే ఆధారపడుతున్నారు.. వారితో నా అనుబంధం కొనసాగుతోంది.. అయితే, భారత్‌లోని ఏ ప్రభుత్వం సంస్కరణలను తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా రైతులు సంతృప్తిచెందలేదు.. విత్తనాలు, ఎరువులు, విద్యుత్ సకాలంలో అంది.. వ్యవసాయ ఉత్పత్తులను వారికి నచ్చి విధంగా అమ్ముకునేలా ఉంటే రైతులకు సంతోషంగా ఉంటుంది’ అని ఉమా భారతి వ్యాఖ్యానించారు.


By November 23, 2021 at 07:52AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bjp-leader-uma-bharti-interesting-comments-on-repealing-farm-laws/articleshow/87859640.cms

No comments