Breaking News

వేదనిలయం జయవారసులదే.. తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు షాక్!


తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి నివాసం విషయంలో మద్రాసు హైకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. చెన్నై పోయెస్‌ గార్డెన్‌లో ఉన్న వేద నిలయాన్ని స్మారకంగా మారుస్తూ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మద్రాసు హైకోర్టు రద్దుచేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ జయలలిత మేన కోడలు దీప, మేనల్లుడు దీపక్‌ వేసిన రిట్‌ పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్‌ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది. జయ వారసులకే చెందుతుందని స్పష్టం చేసింది. భవనం తాళాలను పిటిషనర్లకు అప్పగించాలని హైకోర్టు సూచించింది. అలాగే ఆదాయపు పన్ను బకాయిలను పిటిషనర్ల నుంచి వసూలు చేసేందుకు ఆదాయపు పన్ను అధికారులకు అనుమతిచ్చింది. జయలలిత తల్లి వేదవల్లి 1960లో వేద నిలయాన్ని కొనుగోలు చేశారు. దశాబ్దాల పాటు జయలలిత అందులోనే నివాసం ఉన్నారు. ఆమె మరణానంతరం వేద నిలయాన్ని స్మారకంగా మారుస్తామని అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలకు ప్రవేశానికి అనుమతిస్తామని పేర్కొంది. అందుకు సంబంధించిన బిల్లును 2020 జులైలో తీసుకురాగా.. ఈ ఏడాది జనవరిలో అప్పటి ముఖ్యమంత్రి పళనిస్వామి దీన్ని ప్రారంభించారు. అలాగే, దీనికి సంబంధించి సిటీ కోర్టులో రూ.67.9 కోట్లను డిపాజిట్ చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ జయలలిత మేనకోడలు దీపా, మేనల్లుడు దీపక్‌లు మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. వేద నిలయానికి చట్టపరమైన వారసులం తామేనని వాదించారు. ‘‘వివిధ కారణాల వల్ల ఆమె (జయలలిత) వీలునామాను రాయలేకపోయారు... బహుశా ఆమెపై పెట్టిన కేసులు, అప్పటి రాజకీయ పరిస్థితుల వల్ల కావచ్చు.. అంతేకాదు, చనిపోతానని ఆమెకు తెలియదు’’ అని దీప అన్నారు. 2016 ఎన్నికల్లో గెలిచిన కొద్ది నెలలకే జయలలిత అనారోగ్యానికి గురయి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ ఏడాది డిసెంబరులో కన్నుమూశారు.


By November 25, 2021 at 08:48AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/jayalalithaa-home-veda-nilayam-takeover-by-tamil-nadu-government-cancelled-by-madras-high-court/articleshow/87901512.cms

No comments