Breaking News

పొరుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి ప్రవాహంలా పొగ.. వెల్లడించిన నాసా శాటిలైట్ చిత్రాలు


దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి తర్వాత వాయు కాలుష్యం అసాధారణ రీతిలో పెరిగిపోయింది. కాలుష్య తీవ్రతపై సర్వోన్నత న్యాయస్థానం సైతం తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలో నియంత్రణకు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాలో కూడా కాలుష్యానికి కారకమవుతోంది. తాజాగా, శాటిలైట్ చిత్రాలు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించాయి. పంజాబ్, హరియాణాల నుంచి పొగ ప్రవాహంలా వస్తున్నట్టు నవంబరు 11 నాటి నాసా ఇమేజ్ వెల్లడించింది. ఈ ఫోటోలో ఎరుపు రంగు గుర్తులు పంజాబ్, హరియాణాతో పాటు పాక్‌లోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పంట వ్యర్థాల దహనాలను సూచిస్తున్నాయి. దీనిపై నాసా శాస్త్రవేత్త పవన్ గుప్తా మాట్లాడుతూ... నవంబరు 11న పంట వ్యర్థాల దహనంతో వచ్చిన పొగ వల్ల కనీసం 22 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమవుతారని అన్నారు. ‘‘నవంబరు 11నాటి పొగ పరిమాణం.. ఈ ప్రాంతంలోని జన సాంద్రతను పరిశీలిస్తే ఈ ఒక్క రోజున కనీసం 22 మిలియన్ల మంది పొగ బారిన పడ్డారని సంప్రదాయవాద అంచనా’’ అని పేర్కొన్నారు. నాసా మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌కు చెందిన యూనివర్సిటీస్ స్పేస్ రిసెర్చ్ అసోసియేషన్ (యూఎస్ఆర్ఏ)లో పవన్ గుప్తా శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఢిల్లీ నగరంలో కాలుష్య స్థాయిలు ప్రమాదకరస్థాయి కంటే ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఐదు పవర్ స్టేషన్లను మూసివేసింది. సంక్షోభాన్ని అదుపు చేసేందుకు పాఠశాలలను మూసివేసి ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తోంది. చిన్న గాలి కణాల సాంద్రత, పాక్షికంగా కొత్త సాగు సీజన్‌కు ముందు ఉత్తర భారతదేశంలో రైతులు పంట వ్యర్థాలను దహనం చేయడం వంటి కారణాలతో నవంబరులో సాధారణంగా ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉంటుంది. ఢిల్లీలో కాలుష్యానికి కేవలం పంట వ్యర్థాల దహనం మాత్రమే కాదు, వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణ రంగాల నుంచి వెలువడే దుమ్ము, ధూళి కూడా తోడ్పడుతున్నాయి.


By November 19, 2021 at 08:33AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/nasa-satellite-image-shows-river-of-smoke-over-delhi-nearby-areas-as-farm-fires-burn/articleshow/87791800.cms

No comments