Breaking News

మోసం చేసిన తాపీ మేస్త్రీ.. కాలినడకన హైదరాబాద్ నుంచి అసోంకి వలస కూలీ!


ఎక్కడ ఈశాన్య రాష్ట్రం అసోం.. ఎక్కడ హైదరాబాద్.. ఓ కూలీ దాదాపు 2,500 కిలోమీటర్ల దూరం నుంచి పొట్టకూటికోసం వచ్చాడు. ఇక్కడ తాపీ మేస్త్రీ మోసం చేయడంతో తిరిగి సొంతూరుకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అతడు పెద్ద సాహసానికి పూనుకున్నాడు. చేతిలో పట్టుమని పది రూపాయాలు కూడా లేకపోవడంతో కాలినడకన పయనమయ్యాడు. మూడు నెలల కిందట హైదరాబాద్‌లో ప్రారంభమైన అతడు ఇప్పటి వరకూ 650 కిలోమీటర్లు నడిచి ప్రస్తుతం ఒడిశాకు చేరాడు. దారిలో బిచ్చమెత్తుకుని కడుపు నింపుకుని, ఏదీ దొరకని రోజు మంచి నీళ్లతో సరిపెట్టుకున్నాడు. శుక్రవారం కొరాపుట్‌ జిల్లాలోని లక్ష్మీపుర్‌లో గువాహటికి ఎలా వెళ్లాలంటూ స్థానికులను అడుగుతుండగా.. నరేంద్ర అనే సామాజిక కార్యకర్త కంటబడ్డాడు. అతడి గురించి ఆరా తీయగా.. తన పేరు అజయ్‌ బోడులే అని, అసోంలోని నవ్‌గావ్‌ జిల్లాకు చెందినవాడినని చెప్పాడు. కూలీ ఎక్కువ వస్తుందని ఓ మేస్త్రీ నమ్మబలకడంతో హైదరాబాద్‌‌కు వచ్చి భవన నిర్మాణ పనుల్లో కార్మికుడిగా చేరానని చెప్పాడు. అయితే, ఆకస్మాత్తుగా కనిపించకుండాపోయిన మేస్త్రీ.. మూడు రోజులైనా ఆచూకీ లేదన్నారు. కూలీ డబ్బులు కూడా ఇవ్వకపోవడంతో మోసపోయానని గ్రహించానని అజయ్ తెలిపాడు. ఎవరిని అడగాలో తెలియక, సాయం చేసే వారు లేక స్వస్థలానికి వెళ్లిపోవాలి నిర్ణయించుకున్నానని చెప్పాడు. ఛార్జీలకు డబ్బులు లేక కాళ్లనే నమ్ముకున్నానని, మూడు నెలల క్రితం నడక ప్రారంభించానని వివరించాడు. అతడి దుస్థితికి చలించిపోయిన సామాజిక కార్యకర్త తన ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టారు. సమీపంలో రైల్వే పనుల్లో అసోంకి చెందిన కూలీలు పని చేస్తున్నారని తెలుసుకుని వారి వద్దకు అజయ్‌ను తీసుకెళ్లారు. వారికి విషయం వివరించడంతో అతనికి పని ఇచ్చి తమతో పాటు ఉండటానికి అంగీకరించారు. దీంతో కొద్ది రోజులు అక్కడ పనిచేయాలని అజయ్‌ నిర్ణయించుకున్నాడు.


By November 27, 2021 at 08:41AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/man-start-journey-on-foot-from-hyderabad-to-assam-due-to-dont-have-money/articleshow/87942203.cms

No comments