Breaking News

నేరచరితులపై జీవితకాల నిషేధం విధిస్తారా?.. కేంద్రానికి జస్టిస్ రమణ సూటి ప్రశ్న!


రాజకీయ పదవుల్లో రిజర్వేషన్లు అమలులోకి వచ్చిన తర్వాత అనివార్యంగా అక్కడక్కడా మంచివారు గెలుస్తున్నా, ప్రతి ముగ్గురిలో ఒకరు నేరచరితులేనని ఏడీఆర్ సంస్థ లెక్కలు తేల్చింది. ఎన్నికల ప్రక్షాళనకు కాలక్రమంలో ఎన్నో చర్యలు చేపట్టినా, రాజకీయ పక్షాలు ముందుకు రానంతకాలం ఇది సాధ్యం కాదనేది సుస్పష్టం. వేళ్లూనుకున్న రాజకీయ పార్టీలు ముందుకు వచ్చి నేర చరిత్ర లేని వారికే టిక్కెట్లు ఇస్తామని చెప్పే ధైర్యం లేదా అని మాజీ రాష్టప్రతి కేఆర్ నారాయణన్ సూటిగా ప్రశ్నించినా సమాధానం లేదు. ఈ నేపథ్యంలో కొంత మంది సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోటీ చేయకుండా నిలువరించాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. రాజకీయాలను నేరరహితం చేయాలనే అంశంతో దశాబ్దానికి పైగా సాగిన ప్రయత్నంలో రాజకీయాల్లో గుర్తించదగిన మార్పులను తీసుకురావడానికి అనేక ఉత్తర్వులు జారీ చేసింది. నేరస్థులను ఎన్నికల్లో పోటీచేయకుండా జీవితకాల నిషేధించాలని కోరుతూ సీనియర్ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ ఏడాది కిందట దాఖలైన పిటిషన్‌పై బుధవారం విచారణ పూర్తిచేసి తీర్పు రిజర్వులో ఉంచింది. ఈ అంశంలో కేంద్రం వైఖరి ఏంటని? అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వ నుంచి సూచనలు తీసుకుంటామని అదనపు సొలిసిటర్ జనరల్ బదులిచ్చారు. అయితే, ఈ సమాధానంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దాదాపు 15 నెలల నుంచి కేంద్రం అభిప్రాయాన్ని కోరినా సరిగ్గా స్పందించలేదని వ్యాఖ్యానించింది. ‘దాదాపు 15 నెలల నుంచి కోర్టు కేంద్రం అభిప్రాయాన్ని కోరింది.. దోషులుగా నిర్దారణ అయిన రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం విధించేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? కేంద్రం నిర్ణయం తీసుకుని ఎన్నికల కమిషన్‌ను సంప్రదించి చట్టాన్ని రూపొందించడం లేదా ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించడం తప్ప, ఈ సమస్యను పరిష్కరించడం ఈ కోర్టుకు అంత సులభం కాదు.. శాసన మార్గాన్ని అనుసరించాలా వద్దా అనేది ప్రభుత్వం నిర్ణయించాలి’ అని స్పష్టం చేసింది. ఇక, వాదనలు వినిపించిన అశ్వినీ ఉపాధ్యాయ.. ‘ఘోరమైన నేరానికి పాల్పడి దోషిగా తేలిన వ్యక్తి కనీసం కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా అనర్హుడు.. కానీ, కానీ అదే విధంగా దోషిగా తేలిన వ్యక్తి ఎన్నికలలో పోటీ చేయడానికి, హోం మంత్రి పదవికి అనర్హుడు ఎందుకు కాదు’ అని అన్నారు. ఉపాధ్యాయ్, మరో న్యాయవాది ఎంఎల్ శర్మ దాఖలు చేసిన వ్యాజ్యాలను ధర్మాసనం ప్రస్తావిస్తూ.. ‘మీరు ఎన్ని పిల్‌లు దాఖలు చేశారు?’అని ప్రశ్నించింది. అంతేకాదు, ఉపాధ్యాయ్, ఎంఎల్ శర్మ దాఖలు చేసిన పిల్‌లను మాత్రమే విచారించేందుకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేసే రోజు ఎంతో దూరంలో లేదు అని వ్యాఖ్యలు చేసింది.


By November 25, 2021 at 08:19AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/is-govt-willing-to-put-a-life-ban-on-convicted-netas-asks-supreme-court/articleshow/87901185.cms

No comments