నేటి నుంచే పార్లమెంట్ సమావేశాలు.. తొలి రోజే సాగు చట్టాల రద్దు బిల్లు
పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం (నవంబర్ 29) ఉదయం ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు బిల్లులను ప్రవేశపెట్టనుంది. మొత్తంగా 36 బిల్లులను శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెడుతుండగా.. ఇందులో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తీసుకువచ్చిన సాగు చట్టాల రద్దు చేస్తున్నట్లుగా తెలుపుతూ బిల్లు కూడా ఉంది. అలాగే, క్రిప్టోకరెన్సీ, విద్యుత్ సంస్కరణ బిల్లును కూడా సభలో ప్రవేశపెట్టనున్నారు. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు శీతాకాల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. క్రిప్టో కరెన్సీ ,డిజిటల్ కరెన్సీల రెగ్యులైజేషన్ 2021 బిల్లును కేంద్రం ప్రవేశపెడుతుంది. ఈ బిల్లును ఆమోదించి చట్టం తీసుకురావడం ద్వారా దేశంలో ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను రద్దు చేస్తున్నట్లు అవుతుంది. బిల్లు ఆమోదం పొందితే అవి చెల్లుబాటులో ఉండవు. ఇక అదే సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసే డిజిటల్ కరెన్సీ అధికారిక వినియోగం కోసం మార్గం సుగుమం చేయనుంది. ఆదివారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి పలు పార్టీల నేతలు హాజరయ్యారు. ప్రభుత్వం తరపున కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్, అర్జున్‌రామ్ మేఘవాల్‌లు హాజరుకాగా కాంగ్రెస్ నుంచి మల్లికార్జున ఖర్గే, అధిర్ రంజన్, ఆనంద్ శర్మ హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాల అజెండాను ఖరారు చేశారు. సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఆయా రాజకీయ పార్టీలు తమ డిమాండ్లను ప్రభుత్వం ఎదుట ఉంచాయి. ఇదే సమయంలో సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. మరోవైపు, శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అటు ప్రభుత్వంతో పాటు విపక్షపార్టీలు కూడా కసరత్తు చేశాయి. విపక్షాల లేవనెత్తే అంశాలను సమర్థంగా తిప్పికొట్టేందుకు ప్రభుత్వం సమాయత్తమయ్యింది. నూతన సాగు చట్టాలపై రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో వాటిని రద్దు చేస్తున్నట్లు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన బిల్లును ఈ సమావేశాల తొలిరోజునే ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యవసాయ చట్టాలకు సంబంధించిన బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.
By November 29, 2021 at 09:05AM
No comments