Breaking News

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు వ్యాపారులు సహా నలుగురు హతం.. మాజీ సీఎం విమర్శలు


ఇటీవల కాలంలో జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లు చేపట్టి ముష్కరులను మట్టుబెడుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీనగర్‌‌లో మంగళవారం సాయంత్రం ఇద్దరు వ్యాపారవేత్తలు సహా నలుగుర్ని హతమార్చాయి. హైదర్‌పొర వద్ద జరిగిన ఆపరేషన్‌లో ఇద్దరు , మరో ఇద్దరు మద్దతుదారులు హతమైనట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఇద్దరూ శ్రీనగర్‌లో వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. డాక్టర్ ముదాసిర్ గుల్, అల్తాఫ్ భట్‌లు హైదర్‌పొర వద్ద దుకాణాలను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. డెంటల్ సర్జన్ అయిన ముదాసిర్ గుల్.. కంప్యూటర్ సెంటర్‌ను నిర్వహిస్తూ శిక్షణ ఇస్తుంటాడని, అల్తాఫ్ హార్డ్‌వేర్, సిమెంట్ వ్యాపారం చేస్తున్నాడని వివరించారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని జమ్మూ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ డిమాండ్ చేశారు. ‘అమాయక పౌరులను మానవ కవచాలుగా ఉపయోగించడం, క్రాస్ ఫైరింగ్‌లో వారిని చంపడం.. ఆపై ఉగ్రవాద సానుభూతిపరులుగా ముద్రవేయడం ఇప్పుడు భారత ప్రభుత్వ రూల్‌బుక్‌లో భాగం. నిజాలను నిగ్గుతేల్చడానికి, హేయమైన ఈ సంస్కృతికి ముగింపు పలకడానికి విశ్వసనీయమైన న్యాయ విచారణ జరగడం తప్పనిసరి’ అని ఆమె మండిపడ్డారు. అటు, చనిపోయినవారి కుటుంబాలు సైతం తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. వారిని భద్రతా బలగాలే చంపి, ఉగ్రవాద ఆపరేషన్‌లో చనిపోయినట్టు చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. అంత్యక్రియలు నిర్వహించడానికి తమవారి మృతదేహాలను అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, శాంతి భద్రతల నేపథ్యంలో మృతదేహాలను అప్పగించలేమని పోలీసులు తెలిపారు. అంతేకాదు, నలుగురు మృతదేహాలను శ్రీనగర్‌కు 100 కిలోమీటర్ల దూరంలో హంద్వారా వద్ద ఖననం చేసినట్టు చెప్పారు.


By November 17, 2021 at 07:49AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/two-businessmen-killed-in-srinagar-operation-cops-sasy-supported-terrorists/articleshow/87748756.cms

No comments