రేపిస్టులకు అది తీసేయడమే.. కఠిన చట్టాన్ని తీసుకొచ్చిన పాక్!
మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలను అరికట్టేందుకు తీసుకొచ్చిన కఠిన చట్టానికి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. తాజా చట్టం ప్రకారం మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడి దోషులుగా తేలితే కెమికల్ క్యాస్ట్రేషన్ ద్వారా నపుంసకులుగా మార్చనున్నారు. ఇటీవల కాలంలో పాకిస్థాన్‌లో అత్యాచార ఘటనలు పెరిగిపోతుండటంతో వాటిని సమర్థవంతగా అరికట్టాలని ప్రజల నుంచి డిమాండ్లు, నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాజా బిల్లుకు పాక్ పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే, ఈ బిల్లు ఇస్లామిక్ చట్టాలకు విరుద్ధంగా ఉందని కొందరు వ్యతిరేకిస్తున్నారు. రేపిస్టులను బహిరంగంగా ఉరితీయాలని, క్యాస్ట్రేషన్ గురించి షరియాలో ప్రస్తావన లేదని జమాతే ఇస్లామీ సెనేటర్ ముస్తాఖ్ అహ్మద్ వ్యాఖ్యానించారు. అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుల్లో నాలుగు శాతం కంటే తక్కువ కేసుల్లోనే దోషులకు శిక్ష పడుతుందని పేర్కొన్నారు. రసాయనాల సహాయంతో లైంగిక సామర్థ్యాన్ని తగ్గించే ప్రక్రియను కెమికల్ క్యాస్ట్రేషన్ అంటారు. దక్షిణ కొరియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, యూఎస్‌లోని కొన్ని రాష్ట్రాల్లో ఈ తరహా శిక్ష అమల్లో ఉంది. తాజా చట్టంలోని నిబంధనల ప్రకారం.. మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల కేసుల్లో సత్వర విచారణ చేపట్టేందుకుగాను ప్రభుత్వం ప్రత్యేక కోర్టులను ఏర్పాటుచేస్తుంది. ఈ ప్రత్యేక కోర్టులు నాలుగు నెలల్లోనే విచారణను పూర్తిచేసి.. దోషులుగా నిర్ధారణ అయితే రసాయనాలతో వంధ్య వ్యక్తులుగా మార్చేస్తారు. అలాగే, లైంగిక దాడుల కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించే పోలీసులు, అధికారులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానాలు విధించనున్నారు. తాజా చట్టం ప్రకారం.. ఘటన జరిగిన ఆరు గంటల్లోగా మెడికో-లీగల్ అంశాలను పూర్తిచేయాలి. అలాగే, నేషనల్ డేటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ సహాయంతో లైంగిక నేరాలకు పాల్పడిన నేరస్థుల రిజిస్ట్రీ ఏర్పాటు చేయనున్నారు. బాధితుల వివరాలు వెల్లడించరాదు.. వాటిని బహిర్గతం చేయడం శిక్షార్హమైన నేరం. తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులకు కూడా జైలు శిక్ష, జరిమానా ఉంటాయి. మెడికో-లీగల్ పరీక్ష సమయంలో అత్యాచార బాధితులకు చేసే అమానవీయ, అవమానకరమైన రెండు వేళ్ల కన్యత్వ పరీక్షను ఈ చట్టం రద్దు చేసింది. అలాగే, బాధితురాలిని నిందితుడు క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉండదు. కేవలం న్యాయమూర్తి, నిందితుడి తరఫు లాయర్ మాత్రమే బాధితులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయవచ్చు. దాదాపు ఏడాది కిందటే ఈ బిల్లుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను పాకిస్థాన్ క్యాబినెట్ ప్రతిపాదించగా.. అధ్యక్షుడు అరిఫ్ అల్వీ ఆమోదం తెలిపారు. తాజాగా పార్లమెంట్ సమావేశాల్లో బుధవారం ఆమోదించిన 33 బిల్లుల్లో క్రిమినల్ లా సవరణ బిల్లు కూడా ఉంది. పాక్ పీనల్ కోడ్ 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1898లకు సవరణ చేసింది. ‘అత్యాచార కేసుల్లో దోషిగా తేలిన వ్యక్తుల కెమికల్ క్యాస్ట్రేషన్ అనేది ప్రధాని రూపొందించిన నియమాల తెలియజేసే ప్రక్రియ.. దీని ద్వారా ఒక వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ లైంగిక సంపర్కం చేయలేడు.మెడికల్ బోర్డు గుర్తించిన ఔషధాల ద్వారా కోర్టు నిర్ణయిస్తుంది’ అని బిల్లు పేర్కొంది.
By November 19, 2021 at 07:54AM
No comments