Big Breaking.. మూడు సాాగు చట్టాలు రద్దుచేస్తున్నట్టు మోదీ సంచలన ప్రకటన
నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఏడాది నుంచి రైతులు చేసిన పోరాటానికి కేంద్రం దిగొచ్చింది. శుక్రవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. సిక్కులకు అత్యంత పవిత్రమైన రోజున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు మోదీ పేర్కొన్నారు. అయితే, కొత్త సాగు చట్టాల వల్ల చిన్న రైతులకు మేలు జరుగుతుందని మోదీ అంతకు ముందు వ్యాఖ్యానించారు. రైతులకు మేలు జరిగేలా ఈ చట్టాలను తీసుకొచ్చినా.. అర్ధం చేసుకోవడంలో విఫలమయ్యారని తెలిపారు. ఈ మూడు చట్టాలను వెనక్కు తీసుకునే ప్రక్రియ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. ఈ నెలాఖరు నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రకటన చేస్తామని తెలిపారు. అలాగే, ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రైతులు, నిపుణులు ఉంటారని తెలిపారు. ఈ కమిటీ నిర్ణయాల ఆధారంగా వ్యవసాయ రంగానికి సంబంధించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అన్నదాతల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. వ్యవసాయానికి బడ్జెట్‌లో కేటాయింపులు ఐదు రెట్లు పెంచామని తెలిపారు. రైతులకు తక్కువ ధరకే విత్తనాలు లభించేలా కృషిచేశామని పేర్కొన్నారు. 22 కోట్ల భూసార కార్డులను పంపిణికి చర్యలు చేపట్టామని, ఫసల్ బీమా యోజనను మరింత బలోపేతం చేస్తామని వివరించారు. రైతులు ఆందోళనలను విరమించి ఇళ్లకు వెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గతేడాది నవంబరు 26 నుంచి ఢిల్లీ శివార్లలో రహదారులను దిగ్బంధం చేశారు. ఏడాదిగా రోడ్లపైనే తిష్ట వేసి.. అక్కడే తిండి, అక్కడే నిద్ర. కొంత మంది తమ కుటుంబాలతో పాటు తరలివచ్చి ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. నిరసన తెలుపుతున్న వారిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు.
By November 19, 2021 at 09:29AM
No comments