Breaking News

Aryan Khan Case కొత్త అధికారి సంజయ్ సింగ్.. ఆయన ట్రాక్ రికార్డు చూస్తే షాక్!


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అధికారి సమీర్ వాంఖడేను తప్పించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ కుమార్ సింగ్‌కు ఈ కేసును అప్పగించారు. ఈ నేపథ్యంలో సంజయ్ ఎవరు? ఆయన గతంలో ఇటువంటి కేసులు ఎలా డీల్ చేశారనే ఆసక్తి నెలకుంది. అయితే, ఆయన గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఒడిశా పోలీస్ విభాగం, Central Bureau of Investigation (సీబీఐ)లో వివిధ హోదాల్లో పనిచేశారు. గతంలో పలు అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల ఆటకట్టించి సమర్ధవంతమైన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సంజయ్ కుమార్ సింగ్ 1996 బ్యాచ్ ఒడిశా ఐపీఎస్ క్యాడర్‌కు చెందిన అధికారి. ఎన్సీబీలో చేరడానికి ముందు సంజయ్ కుమార్ సింగ్ ఒడిశా పోలీసు డ్రగ్ టాస్క్ ఫోర్స్ (డీటీఎఫ్)కి అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ)గా ఉన్నారు. డీటీఎఫ్‌లో ఉన్న సమయంలో ఒడిశాలోని డ్రగ్స్ వ్యతిరేక డ్రైవ్‌లను ప్రారంభించారు. భువనేశ్వర్‌లో డ్రగ్స్ అక్రమ రవాణా రాకెట్‌లను సంజయ్ ఛేదించారు. సీబీఐలో 2008 నుంచి 2015 వరకు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ)గా పనిచేశారు. ఈ సమయంలో పలు హైప్రొఫైల్ కేసులను దర్యాప్తు చేశారు. సంజయ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ), ఒడిశా పోలీస్ ట్విన్ సిటీ, ఒడిశా పోలీస్ అదనపు కమిషనర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది జనవరిలో డిప్యూటేషన్‌పై సంజయ్ కుమార్ సింగ్‌ను కేంద్ర సర్వీసులకు బదిలీ చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ)గా చేరారు. ఆయన ఇన్నేళ్ల సర్వీసులో ఎటువంటి క్రమశిక్షణా చర్యలు లేదా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో లేవని, ఎటువంటి అవినీతి ఆరోపణలు లేని సమర్ధ అధికారిగా గుర్తింపు పొందారని కేంద్ర హోంమంత్రిత్వశాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా, ఆర్యన్ ఖాన్‌తో సెల్ఫీలు తీసుకున్న కిరణ్ గోసావి ఈ కేసు మూసేయాలంటే ఎన్‌సీబీ అధికారులకు రూ. 25 కోట్లు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు ఆరోపణలు చేశారు.


By November 06, 2021 at 11:06AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ips-officer-sanjay-kumar-singh-who-will-now-investigate-aryan-khan-drugs-case/articleshow/87549631.cms

No comments