కేరళ బామ్మ గ్రేట్, 104 వయసులో స్టేట్ ఎగ్జామ్.. 100కి 89 మార్కులు వచ్చాయ్
పట్టుదల ఉండాలే కానీ ఏదైనా సాధించొచ్చు.. దానికి వయసు అడ్డంకే కాదు అని నిరూపించారు ఈ బామ్మగారు. వయసులో సెంచరీ కొట్టిన తరవాత పలకాబలపం పట్టి.. దాన్ని పెన్ను పేపరు వరకు తీసుకెళ్లి పరీక్షలు రాసి డిస్టింక్షన్‌లో పాసై ఔరా అనిపించారు. ప్రతిభకు వయసు అడ్డంకి కాదు అని నిరూపించారు. కేరళలోని కొట్టాయాంకు చెందిన కుట్టియమ్మ తన జీవితంలో ఒక్కసారి కూడా స్కూలుకి వెళ్లలేదు. ఐతే 104 ఏళ్ల కుట్టియమ్మ రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో కేరళ స్టేట్ లిటరసీ మిషన్ నిర్వహించే క్లాసులకు హాజరయ్యి రాయడం, చదవడం నేర్చుకున్నారు. కేరళ స్టేట్ లిటరసీ మిషన్ పెట్టిన లిటరసీ టెస్ట్‌లో 100కు 89 మార్కులు సాధించారు. ఈ విషయాన్ని కేరళ ఎడ్యుకేషన్ మినిస్టర్ వాసుదేవన్ శివన్‌కుట్టి ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ కుట్టియమ్మను ప్రశంసించారు. ప్రతిభ అనే ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి వయసు అడ్డంకి కాదని కుట్టియమ్మ నిరూపించారని పేర్కొన్నారు. లిటరసీ టెస్ట్‌లో 89 మార్కులు సాధించడం ద్వారా 4వ తరగతి పరీక్షలు రాయడానికి కుట్టియమ్మ అర్హత సాధించారు. పది పదుల వయసుదాటిన కుట్టియమ్మకు వినికిడి సమస్య కూడా ఉంది. దీంతో పరీక్షలు నిర్వహించే ఇన్విజిలేటర్లను బిగ్గరగా మాట్లాడాలని ఆమె కోరారట. మొత్తానికి పరీక్ష భేషుగ్గా రాసి వందకు 89 మార్కులు సాధించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు ఈ బామ్మగారు. కేరళలో లిటరసీ రేటును మరింత పెంచేందుకు ప్రభుత్వం లిటరసీ మిషన్ అథారిటీని స్థాపించింది. ఈ మిషన్ ద్వారా అక్షరాస్యతపై ప్రజలకు అవగాహన కల్పించడం, ఏ వయసులోనైనా విద్యను అభ్యసించేలా ప్రజలను ప్రోత్సహించడం చేస్తోంది. లిటరసీ టెస్టులో పాసైన వారికి 4, 7, 10, 11, 12వ తరగతులతో సమానమైన పరీక్షలు రాయిస్తోంది. ఈ వరుసలో ప్రస్తుతం కుట్టియమ్మ 4వ తరగతి పరీక్షకు అర్హత సాధించారు. 104 ఏళ్ల వయసులో కుట్టియమ్మ సాధించిన 89 మార్కులు కేరళ స్టేట్ లిటరసీ మిషన్ అథారిటీకి మరింత ఉత్సాహాన్ని ఇచ్చినట్టయింది.
By November 17, 2021 at 08:33AM
No comments