Sudan సైనిక తిరుగుబాటు.. ప్రధాని సహా మంత్రులు అరెస్ట్.. ఆందోళనల్లో ఏడుగురు మృతి
ఆఫ్రికా దేశం సూడాన్‌లో తలెత్తిన అంతర్యుద్ధం ఆందోళనకరంగా మారింది. ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రితో పాటు పలువురు కీలక నేతలను సైన్యం నిర్బంధించింది. ప్రధానితో పాటు ఐదుగురు కీలక మంత్రులను అరెస్టు చేసింది. ఈ పరిణామాలతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనకు దిగారు. తాత్కాలిక ప్రధాని అబ్దల్లా హమ్‌దోక్‌ను అరెస్టు చేసినా ఆయన ఎక్కడున్నారనేది మాత్రం తెలియరాలేదని అక్కడి సమాచార మంత్రిత్వశాఖ ప్రకటించింది. అధికారాన్ని అప్పగించేందుకు ప్రధాని హమ్‌దోక్ సముఖత వ్యక్తం చేయకపోవడంతో సైన్యం ఆయనను సోమవారం అరెస్టు చేసింది. సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టాలని రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్య అనుకూల వర్గాలు పిలుపునిచ్చాయి. దీంతో వేలాది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో సైన్యం, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు తలెత్తాయి. వారిని చెదరగొట్టేందుకు లాఠీఛార్జి, టియర్ గ్యాస్‌ను సైన్యం ప్రయోగించింది. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకూ ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 140 మంది వరకూ గాయపడ్డారు. దీంతో అక్కడ పరిస్థితులు మరోసారి ఆందోళనకరంగా మారాయి. ఆందోళనలు మరింత తీవ్రతరం కాకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను సైన్యం నిలిపివేసింది. విమాన సర్వీసులను రద్దు చేసి, పలు ప్రాంతాలకు రాకపోకలు సాగించే కీలక వంతెనలను కూడా మూసివేసింది. సూడాన్‌లో సైనిక తిరుగుబాటుపై ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్, అమెరికా ఆందోళన వ్యక్తం చేశాయి. ఆ దేశానికి అందజేస్తున్న 700 మిలియన్ డాలర్ల సాయాన్ని అమెరికా నిలిపివేసింది. సూడాన్‌కు 1956లో స్వాతంత్ర్యం లభించినప్పటి నుంచి ఇప్పటి వరకూ సైన్యం తిరుగుబాటు చేయడం ఇది ఎనిమిదోసారి కావడం గమనార్హం. దాదాపు మూడు దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న ఒమర్ అల్-బషీర్‌పై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో సైన్యం జోక్యంతో 2019లో చివరకు ఆయన గద్దె దిగాల్సి వచ్చింది. అనంతరం ప్రజాస్వామ్య పాలనకు ప్రయత్నాలు జరిగాయి. అధికారం చేపట్టేందుకు సైన్యం- ప్రజాస్వామ్యవాదుల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ప్రధానిగా అబ్దల్లా హమ్‌దోక్ మూడేళ్లపాటు బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. ఇదే సమయంలో అధికార మార్పిడిపై వివాదం రాజుకోవడంతో గతనెలలో తిరుగుబాటుకు సైన్యం చేసిన ప్రయత్నం విఫలమయ్యింది.
By October 26, 2021 at 09:57AM
No comments